కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచేసింది. పునీత్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఆయన కుటుంబం, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధిని ప్రతిరోజూ వందల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మంగళవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పునీత్ ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇదే గ్రౌండ్స్ లో పునీత్ ‘రాజకుమార’ సినిమా 100 రోజుల వేడుక జరిగిందని, కానీ ఇప్పుడు అదే గ్రౌండ్స్ లో ఆయన శ్రద్ధాంజలి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 67 ఏళ్లు నిండాయని, వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
‘నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నా. కానీ పునీత్ సంస్మరణ సభకు నేను రావాల్సి వచ్చింది. ఆ దేవుడు పునీత్ కు బదులు నన్ను తీసుకుపోయినా బాగుండేది’ అంటూ శరత్ కుమార్ కన్నీటి పర్యంతం అయ్యారు. పునీత్ అందరినీ వదిలి వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలేదన్నారు. 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. తన సినిమా అరంగేట్రం కర్ణాటక నుంచే మొదలైందని, తన తొలి పారితోషికాన్ని ఇక్కడే అందుకున్నానని అన్నారు.
పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కు ఎప్పుడైనా సాయం చేసేందుకు సిద్ధమన్నారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రచారం కోసమే మంచి చేసినట్టు నటిస్తున్నారని, కానీ ఏం ఆశించకుండా, రాజకీయాల్లోకి రాకుండానే పునీత్ ఎన్నో మంచి పనులు చేశాడని గుర్తు చేశారు. పునిత్ లాంటి గొప్ప మనిషికి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని అన్నారు. అందరూ అంటున్నట్టు ఆయనకు మరణానంతర పద్మశ్రీ ఇస్తే మంచిదేనని, కానీ, అంతకన్నా భారతరత్నకు అతడు ఎక్కువ అర్హుడని చెప్పుకొచ్చారు.