కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై కన్నుమూశారు. పునీత్ మరణంతో ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలు సైతం విషాదంలో మునిగిపోయాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పలువురు కన్నీరు పెడుతున్నారు.
పునీత్ రాజ్ కుమార్ 17 మార్చి 1975లో తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా తెరపై కనిపించారు.
2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్ రాజ్‍కుమార్ ‘అప్పూ’ సినిమాతో హీరోగా మారారు. తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు. ఇందులో 30 సినిమాలు హిట్ అయ్యాయి. అందులో 6 చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీగా కలెక్షన్లు సాధించాయి. 20 సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
పునీత్ బాల నటుడిగా 14 సినిమాల్లో నటించారు. భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో నటించాడు. 1985లో నటించిన “బెట్టాడ హూవు” చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో పునీత్ ఒకరు. నిర్మాతగానూ పునీత్ తనను తాను నిరూపించుకున్నారు. పీఆర్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆరు సినిమాలు నిర్మించారు.
‘లా’, ‘ఫ్రెంచ్ బిర్యానీ’ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై అభిమానులను అలరించాయి. పునీత్ రాజ్ కుమార్ నటించిన అభి, వీర కన్నడిగ, మౌర్య, ఆకాష్, అజయ్, అరసు, మిలానా, వంశీ , పవర్, బిందాస్, జాకీ, హుడుగారు, అన్న బాండ్, రానా విక్రమ, రాజకుమార సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ‘మిలనా’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు.
కేవలం వెండి తెరపైనా కాదు.. బుల్లితెరపై కన్నడద కొట్యాధిపతి షో కి హూస్ట్ గా వ్యవహరించారు.. పలు రియాల్టీ షో లకి జడ్జీగా వ్యవహరించారు రాజ్ పునీత్. అంత గొప్ప నటుడు మన కానరాని లోకానికి వెళ్లిపోవడంతో ప్రేక్షకులు శోకసంద్రంలో మునిగిపోయారు.