కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత కూడా అభిమానుల గుండెల్లో అలాగే బతికున్నారు. నటుడిగానే కాకుండా ఓ సామాజిక సేవకుడిగా ఆయన చేసిన మంచిపనులు తలుచుకొంటూ కన్నడిగులు కాలం గడుపుతున్నారు. ఆయనపై తమకున్న ప్రేమను ఎన్నో రకాలుగా చూపిస్తున్నారు. కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఈరోజు ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓ ఉపగ్రహాన్ని రూపొందించనున్నారు. కర్ణాటకలోని 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ఉపగ్రహాన్ని తయారు చేసే అవకాశం దక్కించుకున్నారు. దీనికి ఇస్రో సహకారం కూడా ఉంది. పునీత్ పేరిట శాటిలైట్ ను రూపొందించనున్నట్టు కర్ణాటక రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ప్రకటించారు. బెంగళూరులోని ప్రముఖ పీయూ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపగ్రహ తయారీ కోసం ప్రభుత్వం తరపున రూ. 1.90 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
సాధారణంగా 50 కిలోల శాటిలైట్ ను రూపొందించేందుకు రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. కిలో బరువున్న శాటిలైట్ ను విద్యార్థులు రూ. 1.90 కోట్లతో రూపొందిస్తారని తెలిపారు. బెంగళూరుకు చెందిన విద్యార్థుల ద్వారానే విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. విద్యార్థుల మేధోశక్తికి మరింత పదును పెడుతూ చేయబోయే ఈ ప్రాజెక్ట్ భారతదేశ చరిత్రలోనే ఓ గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించే ఉపగ్రహాన్ని ప్రయోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి అశ్వథ్ నారాయణ.