శాకుంతలం సినిమా ప్రమోషన్ల కోసం సమంత దేశం ఇటు నుంచి అటు వరకు గ్యాప్ లేకుండా తిరిగారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం కొద్దిగా పాడైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లారు.
ప్రముఖ సౌత్ సూపర్ స్టార్ సమంత గత కొన్నేళ్లుగా మైయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ వ్యాధి కారణంగా ఆమె కొన్ని నెలల పాటు సినిమాలకు దూరం అయ్యారు. ఆస్పత్రి, ఇంటికి పరిమితమై చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కొంత బాగుపడ్డ తర్వాత మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనటం మొదలెట్టారు. కఠినమైన డైట్, ఎక్సర్‌సైజులు, యోగా వంటి వాటితో అనారోగ్యం తిరగబెట్టకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అయితే, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ల కోసం ఆమె మళ్లీ శ్రమ తీసుకోవాల్సి వచ్చింది.
తీరిక లేకుండా దేశం మొత్తం అటు,ఇటు తిరగాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలు, టీవీ షోలకు హాజరుకావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం కొద్దిగా దెబ్బ తింది. దీంతో ఆమె ఆసుపత్రికి వెళ్లారు. హైపర్ బేరిక్ థెరపీ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టారు. తాను ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫొటో చూసే అభిమానులు ఆందోళన పడుకుండా ఉండేందుకు.. హైపర్ బేరిక్ థెరపీకి సంబంధించిన సమాచారాన్ని కూడా పోస్టు చేశారు.
హైపర్‌బేరిక్ అంటే ఏంటంటే.. ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటి చాలా రకాల ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు హైపర్‌బేరిక్ థెరపీ ఉపయోగపడుతుంది. అంతేకాదు.. న్యూరోడీజెనరిక్ కండీషన్స్, ఆటిజం, ట్రొమాటిక్ బ్రెయిన్ గాయాలకు కూడా ఈ థెరపీ పని చేస్తుంది. వాపును తగ్గించటం, ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తుంది, పాడైన కణజాలాన్ని సరి చేస్తుంది. మైయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమెకు ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. సమంత పోస్టులపై స్పందిస్తున్న అభిమానులు ఆమె మరింత ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.