మైయోసైటిస్ కారణంగా మానసికంగా.. శారీరకంగా చాలా నష్టపోయారు. సినిమా విషయంలోనూ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు.
సమంత మైయోసైటిస్‌కు గురై సంవత్సరం గడిచింది. ఆమె ఆ అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మునుపటి కంటే కొంత అరోగ్యంగా తయారయ్యారు. మైయోసైటిస్ వచ్చిన కొత్తలో ఆమె చాలా ఇబ్బందులకు గురయ్యారు. సరిగా నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. శారీరకంగా.. మానసికంగానే కాదు వృత్తి పరంగా కూడా చాలా నష్టపోయారు. కొన్ని నెలల పాటు అల్లాడిపోయారు. సరైన వైద్య చికిత్సలు, ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామంతో ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు ఎంతో హుషారుగా సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. మునుసటిలా షూటింగుల్లో బిజీ అయిపోయారు. అయినప్పటికి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన దేవళ్లను మాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు.
వీలు చిక్కినప్పుడల్లా దైవ దర్శనం చేసుకుంటున్నారు. తాజాగా, ఆమె ఓ ప్రముఖ చర్చీకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఫొటోలతో పాటు ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ఆ వ్యాధి ధ్రువీకరణ అయి ఇప్పటికి సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరం మొత్తం చాలా కష్టంగా గడిచింది. నా శరీరంతో చాలా పోరాటాలు చేశాను. ఉప్పు, చక్కెర, కాక్‌టైల్ ఇలా చాలా వాటిని మానుకోవాల్సి వచ్చింది. వృత్తిపరంగా కూడా ఫెయిల్ అయ్యాను. నేను ఆశీర్వాదాలకోసం.. బహుమతుల కోసం పూజలు చేయలేదు. శక్తిని, ప్రశాంత కోసమే పూజలు చేశాను.
ఈ సంవత్సరం నాకు చాలా నేర్పింది. అంతా మనం అనుకున్నట్లుగా జరగదని నేర్చుకున్నాను. మనం అనుకున్నట్లు జరక్కపోయినా పర్వాలేదు. మనం కంట్రోల్ చేయగలివే వాటిని కంట్రోల్ చేయాలి.. మిగిలిన వాటిని వదిలేయాలి. నేను అంతా గతంలా మారిపోవాలని ఎదురుచూడటం లేదు. ఇతరుల్ని అసహ్యించుకుని నన్ను నేను ఇబ్బంది పెట్టుకోదల్చుకోలేదు. మీలో చాలా మంది కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. నేను మీకోసం కూడా ప్రార్థనలు చేస్తాను. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ, కాదనడు. అవసరమైన వారికి ప్రేమ, సంతోషం, ప్రశాంతతను తప్పకుండా ఇస్తాడు’’ అని పేర్కొన్నారు.