RRR: ప్రపంచ సినీచరిత్రలో పాన్ ఇండియా సినిమాలు కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. ఆ విధంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన పాన్ ఇండియా సినిమాలలో RRR ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ ఏడాది 1000కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా RRR రికార్డు సెట్ చేసింది. ఇండియాలోనే ఆల్ టైమ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ రూ. 223 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి రూ. 1175కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.
ఈ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ రావడానికి దర్శకుడు రాజమౌళి ఓ కారణమైతే.. హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు మరో కారణం. మొత్తానికి స్టార్ కాస్ట్ తో రూపొందిన RRR.. ఇటు దక్షిణాది భాషలతో పాటు అటు బాలీవుడ్ లో కూడా కలెక్షన్స్ దుమ్మురేపింది. 1920ల నాటి స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాలను బేస్ చేసుకొని.. క్రియేట్ చేసిన కల్పిత మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్ రామరాజుగా, ఎన్టీఆర్ భీమ్ గా కనిపించి అలరించారు.
ఇక RRR విడుదలైన 50 రోజుల తర్వాత అంటే.. మే 20న ఓటిటిలో రిలీజ్ అయ్యింది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసి తెలుగు సినిమా సత్తాను చాటిన RRR.. ఇప్పుడు OTT లో ప్రపంచ రికార్డులు తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు ఎక్కువగా వీక్షించిన సినిమాగా RRR రికార్డు సృష్టించింది. జీ5 లో 1000 మిలియన్ల మినిట్స్(కోటి నిముషాలకు పైగా వ్యూస్) వ్యూస్ రాబట్టి RRR వరల్డ్ వైడ్ నెంబర్ 1 మూవీగా నిలిచింది. ఒక తెలుగు సినిమాకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల చిత్రబృందంతో పాటు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా జీ5 నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. జీ5లో 1000 మిలియన్ల నిమిషాల వ్యూస్ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి చిత్రంగానే కాకుండా.. ఏకంగా 190 దేశాల్లో స్ట్రీమింగ్ అయిన ఏకైక ఇండియన్ సినిమాగా RRR సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఎక్కువ దేశాలలో రిలీజ్ అయ్యుంటే ఆ రెస్పాన్స్ అదిరిపోయేదని.. హాలీవుడ్ దర్శకులు, రచయితలు స్పందిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పటికే పలువురు హాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు రాజమౌళి విజన్ కి హ్యాట్సాఫ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇండియన్ సినిమాకు విదేశీ మేకర్స్ కి సెల్యూట్ కొట్టడం.. అందులోనూ ఓ తెలుగు సినిమాకు ఈ గౌరవం దక్కడం పట్ల తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఇజ్రాయెల్ పత్రికలో కూడా ట్రిపుల్ ఆర్ గురించి స్పెషల్ ఎడిషన్ పోస్ట్ చేయడం చూశాం. మరి ఓటిటిలో ట్రిపుల్ ఆర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ సినిమా ఫీవర్ ఇంకా తగ్గలేదని.. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుందని అర్థమవుతోంది.
ఈ విషయాన్ని జీ5 సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఓ RRR రికార్డుకు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం RRR ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ లో.. కెకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు దేశవిదేశాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. మరి బ్లాక్ బస్టర్ RRR మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.