యశ్.. ఈ పేరు ఇండస్ట్రీలోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని యశ్ జీవితంలో నిరూపించాడు. ఒక చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి టీవీ ఆర్టిస్టుగా తర్వాత మోడల్‌గా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. రూ.100 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్- యశ్ తో సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ.1,250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సినిమాలో ప్రశాంత్ నీల్ టాలెంట్ ఎంత ఉందో అదే స్థాయిలో యశ్ కష్టం కూడా అంతే ఉంది. ఒక నటుడిగా జీవితంలో అద్భుతమైన సక్సెస్‌ని కేజీఎఫ్ సినిమాతో యశ్ అందుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో యశ్ దూసుకుపోతున్నాడు.
యశ్‌ను అంతా కేజీఎఫ్ రాకీభాయ్‌గానే రిసీవ్ చేసుకున్నారు. సాధారణంగా యశ్ అని పిలవడం కంటే రాకీ భాయ్ అనే పిలుస్తుంటారు. అంతేకాకుండా ఆ సినిమా మొత్తంలో రాకీ భాయ్ పాత్ర స్వాగ్, యాటిట్యూడ్, క్యారెక్టర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతను చెప్పే ఒక్కో డైలాగ్, విసిరే ఒక్కో పంచ్‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఆ సినిమాలో రాకీ భాయ్‌కి ఇచ్చిన ఒక్కో ఎలివేషన్ నెక్ట్స్ లెవల్ అని అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రాకీ భాయ్ గన్ను పట్టుకుని విలన్లపై బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే థియేటర్లలో ఈలలతో గోలగోల చేశారు. అదే రాకీ భాయ్ నిజజీవితంలో గన్ను పట్టుకుని ధనాధనా బుల్లెట్లు పేలుస్తుంటే ఎలా ఉంటుంది? అదంటే సినిమా కాబట్టి గ్రాఫిక్స్ పెట్టి కవర్ చేశారు అనుకోవచ్చు.
కానీ, రియల్ లైఫ్‌లోనూ యశ్.. రాకీ భాయే అని నిరూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో క్లిప్‌ని యశ్ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో యశ్ M416 రైఫిల్‌తో టార్గెట్ కాల్చడం చూస్తే మతిపోవాల్సిందే. నిజంగా ఎంతో ప్రొఫెషనల్‌గా యశ్ ఫైరింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో షేర్ చేస్తూ.. “టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ ఒక మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ సవాలు ఏంటంటే దానిని ఆపడమే. ఇది ఎంతో అద్భుతమైన రోజు ఈసారి కలాష్నికోవ్‌ని ప్రయత్నిద్దాం” అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కేజీఎఫ్ ఛాప్టర్-3 కోసం సిద్ధమవుతున్నావా? అంటూ కామెంట్ చేస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.