సినీ సెలబ్రిటీలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి తమ అభిమాన హీరో, హీరోయిన్ను కళ్లారా చూస్తే చాలు అనుకుంటారు. వాళ్లని కలవడం కోసం ఎంతో దూరం నుంచి వస్తారు. ఇక అభిమాన తారాలని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ సంతోషంలో కొందరైతే ఏడ్చేస్తారు. ఇక తాజాగా ఓ విద్యార్థిని అయితే.. అభిమాన హీరోని చూసిన ఆనందంలో అతడి కాళ్లకు నమస్కారం చేసింది. ప్రతిగా ఆ హీరో కూడా సదరు ఫ్యాన్ కాళ్లు మొక్కి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ వివరాలు..
రితేష్ దేశ్‌ముఖ్ అంటే మనకు పెద్దగా పరిచయం లేదు. కానీ జెనీలియా భర్త అంటే టక్కున గుర్తు పడతాం. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో వీరు ముందు వరుసలో ఉంటారు. సౌత్‌లో జెనీలియా ఒకానొక టైంలో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. ఇక ఆమెకు ఎక్కువగా గుర్తింపు తెచ్చిన చిత్రం బొమ్మరిల్లు. అందం, అమాయకత్వం, చెరగని చిరునవ్వుకు ప్రతీరూపంగా నిలిచే హాసిని క్యారెక్టర్‌తో కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత కూడా తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. కొంతకాలం తర్వాత జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ పెళ్లి. వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యింది జెనీలియా.
సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా.. ప్రస్తుతం జెనీలియా.. రితేష్ దేశ్ముఖ్తో కలిసి మజిలీ సినిమా రీమేక్‌లో నటించింది. తెలుగులో ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత నటించారు. ఇక హిందీ మజిలీ రీమేక్‌పై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా రితేష్ దేశ్‌ముఖ్ ఓ కాలేజీ క్యాంపస్‌కు వెళ్లాడు. అక్కడ ఆయనకు ఓ విచిత్ర అనుభవం ఎదురయ్యింది.
కాలేజ్ క్యాంపస్‌లో రితేష్‌ని ఓ లేడీ ఫ్యాన్ కలిసింది. అతడి అనుమతితో ఓ ఆల్బమ్‌ని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆతర్వాత రితేష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇక తన అభిమాన హీరోని కలవడం.. అతడితో డ్యాన్స్ చేయడంతో సంతోషం పట్టలేక తీవ్ర భావోద్వేగానికి గురైన సదరు స్టూడెంట్.. రితేష్ పాదాలకు నమస్కారం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటికే షాక్‌లో ఉన్న స్టూడెంట్స్.. రితేష్ చేసిన పనికి మరింత ఆశ్చర్యపోయారు. అభిమానిని పైకి లేపిన రితేష్.. ఆ తర్వాత ఆ యువతి పాదాలకు నమస్కారం చేసి.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక రితేష్ చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. నిలువెత్తు సంస్కారానికి నిదర్శనం మీరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఈ గుణమే మీకు ఎంతో మంది అభిమానులను చేస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.