మామూలుగా హీరోలు, హీరోయిన్లు ఏ కారులోనే వెళ్తుండగా కనబడితే అభిమానులు వెంబడించి సెల్ఫీలు అడుగుతుంటారు. అయితే ఒక అభిమాని మాత్రం తన కోరిక తీర్చమంటూ హీరోయిన్ ని వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లను చూసి అభిమానం పెంచుకోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. జీవితంలో ఒక్కసారైనా కలవాలని, వారితో మాట్లాడాలని కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒక యువతి తన తల్లి కలను నిజం చేసింది. ఆమె తల్లి ఒక హీరోయిన్ కి వీరాభిమాని. జీవితంలో ఒక్కసారైనా మాట్లాడతానా అని ఎదురుచూస్తూ బతుకుతుంది. అలాంటి సమయంలో ఆ తల్లి కూతురు ఆ హీరోయిన్ ఓ కార్యక్రమానికి వస్తుందని తెలిసి అక్కడకు వెళ్ళింది. ఆ హీరోయిన్ కారులో వెళ్లిపోతుండగా వెంబడించి మరీ తల్లి కోరిక నెరవేర్చింది. ప్రముఖ మలయాళ నటి, సింగర్ మంజు వారియర్ కారులో వెళ్తుండగా ఒక అభిమాని వెంబడించింది.
కేరళలోని ఎర్నాకుళంలో ఎరూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె తిరిగి కారు ఎక్కింది. అయితే ఆమె కారులో వెళ్తుండగా ఒక యువతి కారును వెంబడించడం మంజు వారియర్ చూసింది. అయితే కారు ఆపాలని చూసినా ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండడంతో ఆపలేకపోయింది. అయితే అప్పటికీ యువతి ఇంకా కారు వెనకాల పరిగెడుతూనే ఉంది. ఆ విషయం గమనించిన మంజు వారియర్.. కారును ఒక పక్కకు ఆపి ఆ యువతిని దగ్గరకు పిలిచింది. ఎందుకు పరిగెడుతున్నావ్ అని ఆరా తీయగా.. ఆ యువతి మంజు వారియర్ ను రెండు నిమిషాలు మాట్లాడాలని టైం అడిగింది. అందుకు ఆ హీరోయిన్ అంగీకరించింది.
తన తల్లి మీకు (మంజు వారియర్ కు) పెద్ద అభిమాని అని.. ఇవాళ ఆమె పుట్టినరోజు అని, మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే సంతోషిస్తుందని యువతి చెప్పుకొచ్చింది. యువతిని ఫోన్ నంబర్ అడుగగా.. యువతి ఫోన్ నంబర్ చెప్పగా.. మంజు వారియర్ పీఏ ఆ నంబర్ కు కాల్ చేసి హీరోయిన్ కి ఇచ్చాడు. హీరోయిన్ ఫోన్ లో యువతి తల్లికి శుభాకాంక్షలు చెప్పింది. ఈ విషయాన్ని ఆ యువతి మీడియాతో చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ పుట్టినరోజుకు మా అమ్మకు నేను ఇచ్చే అతి పెద్ద బహుమతి ఇదే అంటూ చెప్పుకొచ్చింది. మా అమ్మకు తన అభిమాన నటి ఫోన్ చేసి విష్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి అని ఆమె వెల్లడించింది. మరి యువతి తల్లి కల నెరవేర్చిన మంజు వారియర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.