గార్ల్స్ నెక్ట్ డోర్ అన్న పదానికి నిదర్శనం ఈ నటి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. పక్కింటి అమ్మాయిలా సహజంగా ఉండే ఆమె నటనను చూసి మంత్ర ముగ్దులయ్యారు టాలీవుడ్ ప్రేక్షకులు. మహిళలు సైతం ఆ అమ్మాయిని.. తమ అమ్మాయిగా తీసుకున్నారు
‘అందమైన కుందనాల బొమ్మరా.. చందనాలు నవ్వు చల్లి పోయేరా’అన్న సినీ కవిత్వానికి నిలువుటద్దం ఈ హీరోయిన్. గార్ల్స్ నెక్ట్ డోర్ అన్న పదానికి నిదర్శనం కూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. సహజంగా ఉండే ఆమె నటనను చూసి మంత్ర ముగ్దులయ్యారు టాలీవుడ్ ప్రేక్షకులు. మహిళలు సైతం ఆ అమ్మాయిని.. తమ అమ్మాయిగా తీసుకున్నారు. తెర మీద మనస్సారా నవ్వుతూ, సరదాగా తన చిలిపి చేష్టలతో, తింగరిలా, పక్కింటి అమ్మాయిలా అలరించి.. ఆ తర్వాత అందరి హీరోయిన్లుగానే మూడు ముళ్లు వేయించుకుని భర్తే సర్వస్వం, పిల్లలే లోకంగా బతికేసింది. ఆమెను చూస్తే ఇద్దరి పిల్లలు తల్లిలా అనిపించదు. కానీ నిజం. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరపై కనిపిస్తోంది ఈ నటి.
ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ నటే ఈ ఫోటోని చిన్నారి. వైట్ కలర్ ఫ్రాక్‌లో ఏమీ ఎరుగని ముద్దపప్పులా చూస్తున్న ఈ నటిని గుర్తుపట్టారా..? పైన అంత వివరణ ఇచ్చాక మీకు కాస్త అర్థమయ్యే ఉంటుంది ఆ హీరోయిన్ ఎవరన్నదీ. అయితే క్లారిటీ ఇచ్చేస్తే ఓ పనైపోతుంది కదా. ఆ నటి ఎవరంటే.. హా.. హా.. హా.. మన హాసిని. జెనీలియా డిసౌజా అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ హాసిని అనగానే.. బొమ్మరిల్లు సినిమా హీరోయిన్గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రింట్ అయిపోయింది. ఆ అమ్మడు జన్మదినం నేడు. 35వ పడిలోకి అడుగుపెడుతోంది. 2003లో వచ్చిన తుజే మేరీ కసమ్ (నువ్వే కావాలి రీమేక్)తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ మోడల్ చూపు సౌత్ ఇండస్ట్రీపై పడింది. వస్తూ వస్తూనే శంకర్ మూవీ బాయ్స్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో హరిణీ (బాయ్స్‌లో ఆమె క్యారెక్టర్ పేరు) మారుమ్రోగిపోయింది.
సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది చిలిపి కళ్ల భామ. చక్రి మెలోడి సాంగ్స్‌తో పాటు డిఫరెంట్ కథతో తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ హిట్ కొట్టింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఆ తర్వాత సాంబ, రాజమౌళి సై, నా అల్లుడు, హ్యాపీ, సుభాష్ చంద్రబోస్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమె బాగా పేరు తెచ్చింది మాత్రం బొమ్మరిల్లు. ఈ సినిమాలో హాసినిగా ఆమె చేసిన క్యారెక్టర్.. చిరస్థాయిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తే.. ఆ క్యారెక్టర్ మళ్లీ తనే పోషించింది. హిందీలో కూడా ఈ క్యారెక్టర్ ఆమెనే చేసింది. ఈ మూవీతో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
హిందీ, తమిళ, కన్నడ, తెలుగు సినిమాలతో బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఢీ, రెఢీ, కథ వంటి మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ చేసింది. రానా హీరోగా నా ఇష్టం సినిమాలో చివరి సారిగా టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించిన ఆ అందం.. 2012లో తన తొలి హీరో, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అంతలోనే ఇద్దరు పిల్లలు. అయినా ఏ మాత్రం తగ్గని ఆమె అందం చూస్తే పిల్లలున్న తల్లిలా కనిపించదు. ఆ తర్వాత ఇతర భాషల్లో క్యామియో రోల్స్ లో కనిపించింది.. కానీ తెలుగులో అయితే అప్పటి నుండి కనువిందు చేయలేదు. ఇటీవల తన భర్తతో కలిసి వేద్ (మజిలీ రీమేక్) అనే మరాఠి సినిమాలో నటించింది. ఇప్పుడు జూనియర్ అనే బైలింగ్వల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు ముందుకు వస్తుంది. అప్పటిలాగానే మనల్ని మెప్పిస్తోందేమో చూడాలి.