మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మెగా మల్టీస్టారర్ భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. “ఆచార్య” టీమ్ నాలుగేళ్ల శ్రమకి తగ్గ ఫలితం దక్కిందా? లేదా? అన్న విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
సిద్ధవనంలో స్వయంగా అమ్మవారు వెలిసిన పుణ్య క్షేత్రం ధర్మస్థలి. ఆ ధర్మస్థలి పాదాల చెంత పాదఘట్టం అనే తండా ఉంటుంది. ఆ తండా వాసులే ధర్మస్థలిలో అమ్మవారికి గుడి కట్టించి, పూజించుకుంటూ ఉంటారు. అయితే.. కాల క్రమంలో ధర్మస్థలిలో ధర్మం దారి తప్పుతుంది. అక్కడ.. మున్సిపల్ ఛైర్మెన్ అయిన బసవ.. తన స్వార్ధంతో ధర్మస్థలిలో ధర్మం అనేది లేకుండా అక్రమాలకు పాల్పడుతుంటాడు. పాదఘట్టం వారిని గుడికి దూరం చేయాలని చూస్తుంటాడు. ఇలాంటి సమయంలో ధర్మస్థలిలో ఆచార్య అడుగు పెడతాడు. ధర్మస్థలిలో దర్మం తప్పిన ప్రతి ఒక్కరికి తన స్టయిల్‌లో గుణపాఠాలు చెప్తూ.. పాదఘట్టం ప్రాంత ప్రజల్లో మళ్ళీ ధైర్యాన్ని నింపుతాడు. అయితే.. “ఆచార్య” ఎవరు? పాదఘట్టం ప్రజల కోసం ఇంత కష్టం ఎందుకు పడ్డాడు? ధర్మస్థలిని, పాదఘట్టాన్ని, సిద్దవనాన్ని కాపాడటమే అతని ధ్యేయం ఎలా అయ్యింది? ఈ మొత్తం కథలో సిద్ద ఎవరు? సిద్దాకి.. ఆచార్యకి ఉన్న సంబంధం ఏమిటి అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
కథగా చెప్పుకోవడానికి ఆచార్య మూవీలో కొత్తదనం ఏమీ లేదు. కానీ.., ఆ కథ చుట్టూ ధర్మస్థలి, నక్సల్స్ నేపధ్యం అంటూ.. కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు రచయత, దర్శకుడు కొరటాల. దీంతో.. మాస్‌కి కావాల్సిన అన్ని లేయర్స్‌తో ‘ఆచార్య” కథ సిద్ధమైంది. కానీ, ఈ కథని చెప్పడానికి కొరటాల రాసుకున్న సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకుండా పోయింది. అయితే.. అద్భుతమైన విజువల్స్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఆచార్య మూవీ.. మెయిన్ ప్లాట్‌లోకి కాస్త ఆలస్యంగా ఎంటర్ అయ్యిందేమో అనిపిస్తుంది. కానీ.., ఎప్పుడైతే ఆచార్య రంగంలోకి దిగుతాడో అక్కడి నుండి ఇంటర్వెల్ బ్లాక్ వరకు మూవీ పరుగులు తీస్తుంది. ఇంటర్వెల్‌లో సిద్ద పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోతుంది.
సెకండ్ హాఫ్‌లో సిద్ద పాత్రలో రామ్ చరణ్ ఎంట్రీతో ఆచార్య మూవీ వేగం అందుకుంటుంది. ఇక ఇక్కడి నుండి ఫ్యాన్స్‌కి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సిద్ద పాత్రలో చరణ్ ఒదిగిపోయిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. ఇక, చిరు- చరణ్ అడవిలో కలుసుకోవడం, అక్కడ నక్సలైట్స్‌గా వారిద్దరూ చేసే ఫైట్స్ ఫ్యాన్స్‌కి ఐ-ఫీస్ట్ అందిస్తాయి. కాకపోతే!.. మధ్యలో వచ్చే రామ్ చరణ్ – పూజా హెగ్డేల లవ్ ట్రాక్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక కొరటాల శివకి ఉండే క్లైమ్యాక్స్ వీక్ నెస్ ఆచార్యలోనూ కంటిన్యూ అయ్యింది.
నటీనటుల నటన:
నటుడిగా, మెగా మాస్ హీరోగా చిరంజీవి స్థాయి గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. తన పరిపక్వతమైన నటనతో ఆచార్య మూవీకి ప్రాణం పోశాడు చిరు. ఆచార్య లాంటి కథని బలంగా చెప్పడానికి మెగాస్టార్ తన మాస్ ఇమేజ్‌ని సైతం పక్కన పెట్టి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయడం విశేషం. ఇక 66 ఏళ్ళ వయసులో ఆ గ్రేస్‌తో చిరు వేసిన స్టెప్పులు థియేటర్స్ దద్దరిల్లిపోయేలా చేశాయి. ఈ విషయంలో చిరంజీవి డెడికేషన్‌కి మాత్రం హేట్సాఫ్ చెప్పక తప్పదు. ఇక సిద్ద పాత్రలో రామ్ చరణ్ ఆచార్య మూవీకి ఒక పరిపూర్ణత తీసుకుని రావడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమా, సినిమాకి తనలోని నటుడిని సంతృప్తి పరుచుకుంటూ.., నటుడిగా రామ్ చరణ్ శిఖరాగ్రానికి ఎదుగుతున్న తీరు మాత్రం అభినందించతగ్గది. హీరోయిన్‌గా పూజా పాటల వరకు పరిమితం అయ్యింది. విలన్ బసవ పాత్రలో సోనూ సూద్ కూడా ఆకట్టుకున్నాడు. అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్.. వేద పాత్రలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మిగతా వారంతా తమతమ పాత్రల పరిధి మేర బాగానే ఆకట్టుకున్నారు.
టెక్నీషియన్స్ పనితీరు:
ఆచార్య చిత్రంలో టెక్నికల్ విభాగంలో ముందుగా అభినందించాల్సింది మాత్రం ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్‌ని. కథకి ఆయువు పట్టైన ధర్మస్థలి సెట్‌ని సెల్వ రాజన్ అత్యద్భుతంగా తీర్చిద్దిద్దారు. ఇక తిరు కెమెరా వర్క్ ఆచార్య మూవీకి గ్రాండియర్‌ని తీసుకొచ్చింది. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాత్రం తన స్థాయికి తగ్గ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో విఫలం అయ్యాడు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొరటాల శివలోని రచయత గురించి. కొరటాల శివ సినిమాలకి బలం ఆయన పెన్ పవరే. కానీ, ఆచార్య విషయంలో ఆ స్పార్క్ మిస్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్‌లోని చాలా సన్నివేశాలు “శ్రీమంతుడు, జనతా గ్యారేజ్” సినిమాలని గుర్తుకి తెస్తాయి. అలా అని.. ఆ సినిమాల్లో ఉన్నట్లుగా పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఆచార్యలో కనిపించవు. ఆచార్య విషయంలో రచయతగా కొరటాల ఎంత దారుణంగా విఫలం అయ్యారో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకుందాం. సిద్దాని చిన్నతనంలో అడవిలో వదిలి వెళ్ళేది ఆచార్య. మళ్ళీ అతన్ని కాచుకుని కాపాడేది ఆచార్య. సిద్ద అడవిలో కామ్రేడ్‌గా మారేది ఆచార్య కోసం. ఆచార్య ధర్మస్థలికి వచ్చేది సిద్ద కోసం. ఈ రెండు పాత్రల మధ్య ఇంత భావోద్వేగంతో కూడిన ప్రయాణం ఉన్నప్పుడు.. వీరిద్దరిని తండ్రికొడుకులుగా చూపించి ఉంటే కథలో ఎమోషన్ పది రెట్లు ఎక్కువ కనెక్ట్ అయ్యేది. అలా కాకుండా సిద్ద.. ఆచార్య గురువు బిడ్డ కావడంతో ఈ ఎమోషన్‌కి ఆస్కారం లేకుండా పోయింది. ఇక దర్శకుడిగా మాత్రం కొరటాల శివ పరవాలేదు అనిపించాడు.
ప్లస్ పాయింట్స్:
చిరంజీవి, రామ్ చరణ్ నటన
చిరంజీవి, రామ్ చరణ్ డ్యాన్స్
యాక్షన్ సీక్వెన్స్ లు
కెమెరా
ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్:
కథ
కథనం
డైరెక్షన్
మణిశర్మ మ్యూజిక్
చివరి మాట:
ఆచార్య.. ఆశించిన స్థాయిలో లేదు.
(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత కోణానికి సంబంధించింది మాత్రమే. గమనించగలరు)