చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!
త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం ఇలా మూడు యుగాలు ఉన్నట్లే చిరంజీవి యుగం అనేది కూడా ఒకటి ఉందని రేపటి తరాలు తెలుసుకుంటాయి. శివ శంకర్ వరప్రసాద్ గా అంజనా దేవి గర్భంలో నుంచి ఈ భూమ్మీద పాదం మోపిన చిరంజీవికి తన జన్మ రహస్యం గురించి అర్థం అయినట్లు అంటే తాను ఈ భూమ్మీదకి ఎందుకు వచ్చానో నాకు తెలుసనే రీతిలో ఆంజనేయ స్వామి ఆయన కలలో కనిపించి చిరంజీవి అని పిలవడం అప్పటి నుంచి చిరంజీవి నామధేయంతో కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిరంతరం కొలువు తీరిన కారణ జన్ముడు చిరంజీవి. ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు. కోట్లాదిమంది అభిమానులకి పండగ రోజు.
కళ అనేది పవిత్రమైనది. కళ సాక్షాత్తు ఆ ఆదిశంకరుడి రూపం. ఒక మనిషిని మంచి వైపు ఆలోచింపచేయాలన్నా, బాధల నుంచి ఉపశమనం పొందేలా చేయాలన్నా, హాయిగా నవ్వుకునేలా చేయాలన్నా.. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పే పరమ పవిత్రమైనది కళ. వీటన్నింటినీ సినిమా రూపంలో ప్రపంచానికి చెప్తుంది కాబట్టే కళ ఒక జీవ నదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. కాలం ఆగడం తప్ప కళ తన ప్రయాణాన్ని ఆపదు. కళ చేసే ప్రయాణంలో కళకి తోడుగా ఉన్న కళామతల్లి ముద్దు బిడ్డ చిరంజీవి.
స్లోగా ముందుకు వెళ్తున్న తెలుగు సినిమాని జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోయేలా చేసిన హీరో చిరంజీవి. చిరంజీవి గురించి కొత్తగా తెలుసుకోవలసిన వాళ్ళు ఈ విశ్వంలో ఎవరు లేరు. చిరంజీవి చేసే డాన్సులు, ఫైట్లు, విలన్ కి వార్నింగ్ ఇచ్చే విధానం, అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవి డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఎలాంటి రేంజ్ లో ఉంటాయో సినీ ప్రేక్షకులకే కాదు పంచభూతాలకు సైతం తెలుసు. తెలుగు సినిమాని భారత దేశంలోనే నెంబర్ వన్ రేంజ్ లో ఉంచింది చిరంజీవినే. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని వేరియేషన్స్ లో చిరంజీవి చేసినట్టు ప్రపంచంలో ఉన్న ఇంకా ఏ బాషా నటుడు కూడా చేయలేడు. .
చిరంజీవి ఇది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ఒక శక్తి. ఎంతోమందిని విజయం వైపు నడిపించగల శక్తి. ఆయనొక వ్యక్తి కాదు, ఒక మహా వ్యవస్థ. ఆయన ఒక్క సంతకం అభిమానులకు ఆటోగ్రాఫ్ అవుతుంది. ఆయన ఒక్క సంతకం వందల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకు తానుగా ఒక్కో రాయి పేర్చుకుంటూ పునాది రాళ్ళు వేసుకుని, ఇది కథ కాదు జీవితం అని చెప్పి తన జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలా పరిచిన మాస్టర్. స్వయంకృషితో ఎదిగిన ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్. అభిమానుల హృదయ చెరసాలలో బందీగా ఉన్న ఖైదీ, ఖైదీ నంబర్ 786, ఖైదీ నంబర్ 150 ఆయన. ఎంతోమంది నిస్సహాయుల సమాధానం. హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ చరిత్రలో ఒక లెజెండ్ గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆయనకు ఆయనే పోటీ, ఆయనకు ఆయనతోనే పోటీ అనేలా ఆయన నటన మీద ఆయనే ఛాలెంజ్ విసురుకున్నారు. విజేతగా నిలిచారు. కొండవీటి రాజాగా, చంటబ్బాయ్ గా, పనిలో రాక్షసుడుగా బాక్సాఫీస్ వద్ద మరణ మృదంగం వాయించే కొదమ సింహం ఆయన. రికార్డులకు ఘరానా మొగుడు చిరంజీవి. బాక్సాఫీస్ దండయాత్ర చేసే హిట్లర్ ఆయన. ఎంతోమంది అభిమానులకే కాదు.. ఇండస్ట్రీకి వచ్చిన చిరు తమ్ముళ్లకు ఆయనే అన్నయ్య. చిరంజీవి అనే సింహాసనం మీద కూర్చున్న ఇంద్రసేనారెడ్డిగా.. అవినీతిని అంతం చేసే ఠాగూర్ గా.. జీవితంలో వచ్చే కష్టాలనే విలన్ల తుక్కు రేగ్గొడుతూ మనసుతో మందు వేసే శంకర్ దాదా ఎంబీబీఎస్ గా.. జై చిరంజీవగా, స్టాలిన్ గ, సైరా నరసింహారెడ్డిగా, ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా, వాల్తేరు వీరయ్యగా, భోళా శంకరుడిగా అభిమానులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.
68 ఏళ్ల వయసులోనూ అలుపెరగని బాటసారిలా ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కూర్చుని ఉన్నా తరగని అభిమానం ఆయన సొంతం. అయినా గానీ అభిమానుల కోసం ఈ వయసులోనూ కష్టపడుతున్నారు. జయాపజయాలు అందరి జీవితాల్లో ఉండేవే. కానీ జయాపజయాలను లెక్కచేయకుండా ముందుకు వెళ్లేవారే మగమహారాజులు. చిరంజీవి అదే చేస్తున్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ విభిన్న కథాంశంతో మన ముందుకు రానున్నారు. మనకు తెలుసు.. వశిష్ట కాన్సెప్ట్ ఎలా ఉంటుందో. బింబిసారతో ఆల్రెడీ తానేంటో చూపించారు. ఇప్పుడు చిరుతో మరో మాస్టర్ పీస్ కి సిద్ధమయ్యారు.
కళ ప్రజల మంచి గురించి ఆలోచిస్తుంది అనేలా కళామతల్లి ముద్దు బిడ్డ అయిన చిరంజీవి తనని ఇంతటి వాడ్ని చేసిన ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రక్తం లేకుండా ఎంతో మంది చనిపోతుంటే ఇంకెప్పుడు రక్తం లేకుండా ఎవరి ప్రాణం పోకూడదని బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. నేడు ఆ బ్లడ్ బ్యాంకు ద్వారా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడబడుతున్నారు ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్లడ్ బ్యాంకుగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు కీర్తికెక్కింది. అలాగే చూపు లేని వారి కోసం ఐబ్యాంకుని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో మంది తాము చనిపోయాక తమ కళ్లని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇదంతా జరుగుతుంది కేవలం చిరంజీవి అనే వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో. అలాగే రాజకీయాల్లో కూడా చిరంజీవి రాణించి ప్రజలకు ఎంతగానో సేవ చేశారు.
సినీ అభిమానులకి, అలాగే చిరంజీవి అభిమానులకి చిరంజీవి అంటే కేవలం హీరోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుడు కూడా. చిరంజీవితో తెలుగు సినిమా ప్రేక్షకులకి ఉన్న బంధం ఈనాటిది కాదు. వాళ్ళ అన్నప్రాసన దగ్గర నుంచి సాగుతున్న అనుబంధం. ఇంక చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే చిరంజీవి అభిమానులు ఉదయాన్నే గుడుల్లో, మసీదుల్లో, చర్చిల్లో చిరంజీవి పేరు మీద పూజలు జరిపించారు. అలాగే పెద్ద ఎత్తున అన్నదానాలు కూడా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో రక్తదానం కూడా చేశారు.
అమ్మ మనసు చిరంజీవి మనసు రెండు ఒకటే. శత్రువుని సైతం స్నేహితుడిలా చూసే తత్వం చిరంజీవిది. ఆయన ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ మెగాస్టార్ చిరంజీవి.