హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసిన యశోద.. విడుదలయ్యాక సమంత యాక్షన్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. యశోద ఓటీటీ విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని తాజాగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు? ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ సినిమాను దర్శక ద్వయం హరి–హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సరోగసీ నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు సమస్యగా పరిణమించింది. ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ లో ఇవా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతినేలా చూపించారని సదరు హాస్పిటల్ వారు కోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో హాస్పిటల్ పేరు చూపించడం వలన.. ప్రస్తుతం నడిచే ఇవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతింటుందని యాజమాన్యం పిటిషన్ లో పేర్కొంది. దీంతో యశోద ప్రొడక్షన్ కు కోర్టు నోటీసులు పంపింది. సినిమాను డిసెంబర్ 19 వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని వెల్లడించింది. తదుపరి విచారణ డిసెంబర్ 19కు వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది.
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న యశోద సినిమా, ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. యశోద మూవీని డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారట. అయితే.. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ప్రసారం అవ్వకపోవచ్చు. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.