సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. వాటిలోనూ ముఖ్యంగా సౌత్ సినిమాల ఆధిపత్యం కొనసాగుతోంది. సౌత్ నుంచి విడుదలవుతున్న ప్రతి ఒక్క సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. సౌత్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు సౌత్ సినిమాలను పొగడటం మొదలు పెట్టారు. నార్త్- సౌత్ అని తేడా లేదు.. మొత్తం ఒకటే ఇండస్ట్రీ.. అది ఇండియన్ సినిమా అనే ప్రవచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో మూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనే పరిస్థితి ఉండేది. మరి, అలాంటి స్థితి నుంచి ఈ స్థాయికి సౌత్ సినిమా ఎలా చేరింది? బాలీవుడ్ పతనానికి కారణం ఏంటో చూద్దాం.
మూడేళ్ల క్రితం వరకు సౌత్ సినిమాలన్నీ కేవలం ఓ రీజనల్ మూవీలుగా మాత్రమే గుర్తించబడేవి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా అది సౌత్ సినిమా అని ముద్ర వేసేవారు. ఇండియన్ సినిమా అనగానే అంతా బాలీవుడ్ వైపు మాత్రమే చూసేవారు. బడ్జెట్ పరంగానూ, కలెక్షన్స్ పరంగానూ బాలీవుడ్ స్టామినా ఓ రేంజ్ లో ఉండేది. హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా సౌత్ లో రెండు, మూడు సినిమాలు హిట్ కొట్టగానే బాలీవుడ్ వైపు పరుగులు పెట్టేవారు. అక్కడ వారి అదృష్టాన్ని పరీక్షించుకుని.. అక్కడే సెటిల్ అయ్యేవారు.
కానీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి మారిందనే చెబుతున్నారు. సౌత్ సినిమాల స్టామినా దెబ్బకు బాలీవుడ్ బాద్ షాలు తలగ్గొక తప్పడంలేదు. కొన్నాళ్లుగా సౌత్ నుంచి బాలీవుడ్ వైపు వలసలు ఆగిపోయాయనే చెప్పాలి. దానికి భిన్నంగా ఇప్పుడు నార్త్ నుంచి యాక్టర్లు, హీరోయిన్లు సౌత్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ హీరోలు సైతం సౌత్ డైరెక్టర్లతో సినిమాలు తీసేందుకు వెంపర్లాడుతున్నారు. సౌత్ సినిమాలే లేకపోతే కరోనా తర్వాత బాలీవుడ్ డిస్టిబ్యూటర్లు అంతా నష్టపోయేవారు అని స్వయంగా అక్కడి వారే కామెంట్ చేయడం చూశాం. అయితే ఇంతటి మార్పులు, సౌత్ సినిమాలకు అంతటి క్రేజ్ రావడానికి కారణం కరోనా అనే చెప్పాలి.
అవును.. కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో రంగాలు కుంటుబడ్డాయి, అనేక సంస్థలు, కంపెనీలు మూతపడి లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. దాదాపు రెండేళ్ల పాటు ఒక్క సినిమా షూటింగ్ కూడా జరగలేదు. అసలు సినిమా తీయాలనే ఆలోచన వచ్చినా.. దర్శక నిర్మాతలకు వెన్నులో వణుకుపుట్టే పరిస్థితులు. ఆ రెండేళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కకావికలం అయిపోయింది. అసలు ఏ నిర్మాత అయినా సినిమా తీసేందుకు ముందుకు రాగలరా అని డైలమాలో ఉండిపోయారు.
బాలీవుడ్ దర్శకులు మొత్తం పూర్తిగా ఖాళీగా ఉండిపోయారు. అసలు సినిమాలు తీయగలమో.. లేదో అంటూ రెండేళ్ల సమయాన్ని వృథా చేశారు. ఆ పరిస్థితుల్లో సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ కు పూర్తి భిన్నంగా ఆలోచించారు. రెండేళ్ల సమయంలో వారి కథల స్థాయిని పెంచుకున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో రానటువంటి స్థాయిలో కథలు, బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాకుండా.. ప్రొడ్యూసర్లను సైతం ఒప్పించి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేశారు.
విడుదల చేయడమే కాదు.. సౌత్ సినిమాల సత్తా ఏంటో ప్రపంచస్థాయిలో నిరూపించారు. ఇలాగే ఇంకొన్నాళ్లు కొనసాగితే ఇండియన్ సినిమా అంటే.. సౌత్ సినిమాలే అనే పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్పొచ్చు. ఇకనైనా బాలీవుడ్ డైరెక్టర్లు మూస ధోరణి వీడకుంటే మరింత పతనం అవుతారంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ రేంజ్ పడిపోవడానికి కారణాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.