సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ట్రెండ్ అవుతారో చెప్పలేం. అలా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్ ‘జారు మిఠాయి’ ఆంటీ. చెప్పాలంటే ఈమె ఈవెంట్ లో పాడి నెలరోజులకు పైనే అయిపోయింది. కానీ స్టేజీపై ఆమె పాట పాడిన వీడియో కొన్నిరోజుల క్రితం సడన్ గా వైరల్ అయింది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్… ఇలా ఎక్కడ చూసినా సరే ఆమె పాపులర్ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంగ్ కి అడిక్ట్ అయిపోయారు. అసలు ఈ పాట ఎలా పుట్టింది? దీని మీనింగ్ ఏంటనే విషయాలు మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాటినే మేం చెప్పబోతున్నాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జానపద గేయాలకు మంచి ఆదరణ ఉంది. కానీ అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడో ఓ చోట మాత్రమే అవి వినిపిస్తున్నాయి. దురదృష్టం కొద్దీ వాటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. పల్లె పాటలను బ్రతికించాలని, జనాల్లోకి ఆ పాటలను తీసుకెళ్లాలనే ఆలోచన ఎవరూ చేయట్లేదు. ఇక రీసెంట్ గా మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాలో ‘జారుమిఠాయి’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. అయితే ఆ పాటకు ఇన్సిపిరేషన్ చిత్తూరులోని జానపదం గేయం అని తెలుస్తోంది. ఆ పాట ద్వారా టాలెంట్ ఉన్న ఇద్దరు మహిళలు భారతమ్మ, నాగరాజమ్మ వెలుగులోకి వచ్చారు.
ఇక తాజాగా ‘జారు మిఠాయి’ భారతమ్మని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే ఆ పాట ఎలా పుట్టింది? అర్థం ఏంటని తదితర విషయాలు బయటపెట్టింది. తన ఊరు పారువాలు గ్రామం అని భారతమ్మ చెప్పారు. చిన్నప్పుడు మేకలు, గొర్రెల కాయడానికి వెళ్తున్నప్పుడు పాడిన పాటలు ఇవని ఆమె చెప్పింది. తనతో పాటు వచ్చిన ఆడపిల్లలకు జడవేసే సందర్భంలో ‘జడేస్తా జడేస్తా చూడు.. నచ్చకుంటే తీసేస్తా చూడు’ అని పాడతామని.. ఇక ‘జంకలకిడి జారు మిఠాయి’ అంటే అమ్మాయి పేరు అని భారతమ్మ చెప్పారు. ఇదే పాటలోని ‘మొగ్గలఖాలింక’ అంటే అబ్బాయిలు మనల్ని చూడట్లేదు అని అర్థం వస్తుందని భారతమ్మ తెలిపారు. అమ్మ వాళ్ల ఊరిలో ఈ గీతాల్ని నేర్చుకున్నానని తెలిపింది. అయితే తన పాట పాడినందుకు మోహన్ బాబు రూ.50 వేలిచ్చారని ఆమె రివీల్ చేశారు.