Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 29న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ కి దగ్గరపడిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.
ఈ క్రమంలో తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ రెవిన్యూ అధికారిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చాలాకాలం తర్వాత రవితేజ నుండి మాస్, క్లాస్ అంశాలతో కంటెంట్ ప్రధానంగా వస్తోంది ఈ సినిమా. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ శరత్ మండవ చాలా కూల్ గా, ఇంటరెస్టింగ్ గా డీల్ చేశాడని కట్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇక సినిమాలో హత్యలు, మిస్సింగ్ కేసులు, సస్పెన్స్ తో కూడిన ఎపిసోడ్స్ చాలానే ఉన్నట్లున్నాయి. దానికి తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు సామ్ సి ఎస్. ‘ఇన్నాళ్లూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇక రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను’ అని రవితేజ చెప్పడంతో ట్రైలర్ మొదలవుతుంది. చూస్తుంటే.. ఇందులో రామారావుగా రవితేజ ధర్మాన్ని కాపాడే మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చూపించారు మేకర్స్. మరి వీరిలో ఒకరు మాత్రమే మెయిన్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ ట్రైలర్ లో అదనపు ఆకర్షణగా నిలిచాయి. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం మీద రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. మరి ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.