నరేశ్– రమ్య రఘుపతి వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యవహారం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. నరేశ్- పవిత్రా లోకేశ్ సహజీవనం, పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తల నేపథ్యంలోనే రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. నరేశ్ తనని గన్ను పెట్టి బెదిరించి విడాకులు ఇవ్వమని బెదిరించినట్లు ఆరోపించారు. రమ్య మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు.. ఆమె నుంచి ప్రాణ హాని ఉందని నరేశ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ప్రస్తుతం రమ్య రఘుపతి విడాకుల విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ఆమెకు అస్సలు విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. తనకి తన భర్తే ముఖ్యమని.. తన సంసార జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు పవిత్ర లోకేశ్ పై కూడా నిప్పులు చెరిగారు. ఆమె వచ్చిన తర్వాతే తన సంసార జీవితం ఛిన్నాభిన్నమైనట్లు తెలిపారు. వాళ్లిద్దరూ అసలు ఎలా కలిసుంటారో చూస్తానంటూ శపథం చేశారు.
తనకు ఎలాంటి విడాకులు వద్దని.. తనకి తన భర్త కావాలని స్పష్టం చేశారు. తన కుమారుడు సైతం విడాకులు ఇవ్వద్దంటూ కోరినట్లు తెలిపారు. ఆదివారం మైసూరులో నరేశ్- పవిత్రా లోకేశ్ ఒకే హోటల్ లో ఉండగా రమ్య రఘుపతి అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రమ్య రఘుపతి- పవిత్రా లోకేశ్ ను చెప్పుతో కొట్టబోతే పోలీసులు వారించి అక్కడి నుంచి పంపేశారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, తన భర్త తనకి కావాలని క్లారిటీ ఇచ్చారు.
ఆ తర్వాత నరేశ్ మాట్లాడుతూ మరో కొత్త పేరుతో రమ్య రఘుపతిపై సంచలన ఆరోపణలు చేశారు. రాకేశ్ శెట్టి అనే వ్యక్తితో కలిసి రమ్య తమపై దాడి చేసిందని.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. వారికి అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వారిపై దాడి చేయడమే కాకుండా.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ నరేశ్ ఆరోపించాడు. ప్రస్తుతం నరేశ్- పవిత్రా లోకేశ్- రమ్య రఘుపతి వీరి మధ్య జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. రమ్య రఘుపతి శపథంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.