Surinder Sharma: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ హాస్యనటుడు, కవి సురీందర్ శర్మ కన్నుమూశారు. ఆయన మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఆయన మృతికి సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. సురిందర్ శర్మ అంత్యక్రియలు జూన్ 27న మధ్యాహ్నం 2 గంటలకు సెక్టార్ 25లో ఉన్న చండీగఢ్ శ్మశాన వాటికలో నిర్వహించినట్లు సమాచారం.
సురీందర్ మరణ వార్తను పంజాబీ నటుడు మల్కీత్ రౌనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సురేందర్, గుర్‌ప్రీత్ ఘుగ్గీలతో ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ, “మేము చాలా బాధతో మీకు తెలియజేస్తున్నాము, గౌరవనీయమైన డాక్టర్ సురేందర్ శర్మ (రచయిత, నటుడు, దర్శకుడు) మాతో లేరని చెప్పడానికి మాటలు రావడం లేదు. అంత్యక్రియలు జూన్ 27న మధ్యాహ్నం 2 గంటలకు సెక్టార్ 25 చండీగఢ్ లో జరుగుతాయి” అని పోస్ట్ లో తెలిపారు.
ఇక సురీందర్ కెరీర్ విషయానికి వస్తే.. చాలా చిన్న వయస్సులోనే నటనను ప్రారంభించారు. రంగస్థల నాటకాలు, సినిమాలు మరియు ప్రదర్శనలు వంటి వివిధ మాధ్యమాలలో ఆయన తన ప్రతిభను చాటారు.ముఖ్యంగా ఆంఖేన్ ముతియార్, దేశీ రోమియో, ఇక్ కుడి పంజాబ్ ది వంటి పాపులర్ సినిమాలలో ఉపాధ్యాయుడి పాత్రలలో కనిపించారు. సత్ శ్రీ అకాల్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సురీందర్, ఆ తర్వాత యారీ జట్ ది మరియు ఆంఖ్ జట్ దిలో కూడా నటించారు. ప్రస్తుతం సురిందర్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.