సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఇక ఆస్కార్ బరిలో ఇండియా నుంచి నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విస్సరర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డును అందుకుంది. మరి ఆ సినిమా కథ ఏంటి, ఎవరు డైరెక్ట్ చేశారు వంటి వివరాలు..
ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియా సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంవత్సరం మన దేశం నుంచి ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం ఉదయం గ్రాండ్‌గా ప్రారంభమైన ఆస్కార్ వేడుకలు-2023లో ఇండియా ఒక అవార్డుతో ఖాతా తెరిచింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డును అందుకుంది. ఏనుగులు, వాటితో మనిషికున్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అవార్డు సాధించడం విశేషం. ఓ అనాథ ఏనుగు పిల్ల, దానిని ఆదరించిన దంపతుల కథతో సుమారు 42 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిలిం.. తాజాగా ఆస్కార్స్‌లో కూడా సత్తా చాటింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
అనాథ ఏనుగు పిల్లతో ఓ దంపతులకు ముడిపడిన బంధాన్ని ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాకక్యుమెంటరీ ఆవిష్కరించింది. ఆ దంపతులు మనుషులతో సంభాషించినట్టుగానే ఏనుగుతోనూ మాట్లాడటం.. అది కూడా వాళ్ల భావాల్ని అర్థం చేసుకొని చెప్పినట్టు వినడం.. ఇలా ఈ మూవీలోని ప్రతిఘట్టం అపురూపమే. పిల్లలులేని ఆ ఇంట ఏనుగు పిల్లే పసిబిడ్డ అవుతుంది. దాని కోసం ఆ దంపతులు వారి జీవనశైలిని కూడా మార్చుకుంటారు. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడమే కాక.. అవార్డు సైతం గెలుచుకుంది. ఇంత ప్రతిష్టాత్మక చిత్రానికి కార్తికి గోన్సాల్వేస్ అనే యువతి దర్శకత్వం వహించారు.
సినిమా మొత్తం మీద మనకు కనిపించేది ఇద్దరు వ్యక్తులు, ఏనుగు పిల్ల మాత్రమే. కానీ చిత్రీకరించింది మాత్రం 450 గంటల ఫుటేజీ. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఇక అద్భుతమైన పనితనంతోనే మొదటి చిత్రంతోనే కార్తికి గోన్‌సాల్వెస్ ఆస్కార్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇక ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కించిన కార్తికి గోన్సాల్వేస్ విషయానికి వస్తే.. ఆమె స్వస్థలం ఊటి. తండ్రి ఫొటోగ్రాఫర్, తల్లి జంతు ప్రేమికురాలు. తల్లిదండ్రుల నుంచి ఈ రెండు లక్షణాలు పుణికిపుచ్చుకుంది కార్తికి. వీరు నివాసం ఉండేది కూడా నీలగిరి జీవావరణ రిజర్వ్ సమీపంలోనే అలా అడవిపై కార్తికికి ప్రేమ పెరిగింది.
కార్తికి తొలుత తన తండ్రిలా ఫొటోగ్రాఫర్ అవ్వాలనుకుంది. ఆ లక్ష్యం కోసమే విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్‌లో పీజీ చేసింది. తర్వాత ప్రకృతి, దాని చుట్టూ జీవనంపై దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా కార్తికి మాట్లాడుతూ..‘‘నేను మహిళలు, గిరిజన తెగలు, ప్రకృతి, మూగజీవాల గొంతుక అవ్వాలనుకున్నా. అందుకు నేను ఎంచుకున్న మార్గం ఫొటోగ్రఫీ. ప్రజల్లో మార్పు తేవడానికి నాకు కనిపించిన అత్యంత ప్రభావవంతమైన ఆయుధమిది’’ అని తెలిపింది కార్తికి.
తాను చూసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఆలోచన వచ్చింది అని తెలిపింది కార్తికి. సుమారు అయిదేళ్ల క్రితం.. కార్తికి ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం గమనించింది. వాళ్లిద్దరి మధ్య అనుబంధం కార్తికిని ఆశ్చర్యపరిచింది. వారి కథ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ వ్యక్తితో మాట కలిపితే ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడించాడు అంది కార్తికి. తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసి పెంచుకున్నట్లు కార్తికి తెలిపాడు. ఆ సంఘటన కార్తికి కెరియర్‌ను మలుపు తిప్పింది. ఆ వ్యక్తి మాటల్లోంచి పుట్టుకొచ్చిందే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా.
ఈ సందర్భంగా కార్తికి మాట్లాడుతూ.. ‘‘నా సినిమాలోని దంపతులు ఇద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నవాళ్లే. ఏనుగు పిల్లతో ఆ దంపతుల అనుబంధమే కథగా తీశా. దాన్ని హడావుడి కథగా ముగించడం నాకు ఇష్టం లేదు. వారి మధ్య చోటు చేసుకునే అన్ని రకాల భావోద్వేగాలను చూపించాలి. కెమెరా లేదన్న భావన కలిగించినప్పుడే అది సాధ్యం. దానికోసం నేను ముందు 18 నెలలు పాటు వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. మిగతా సమయమంతా ఏనుగులు, వాళ్ల మధ్య సహజ సాన్నిహిత్యాన్ని షూట్ చేశాం. అందుకే 450 గంటల ఫుటేజీ వచ్చింది. ఈ సమయంలోనే ఆ దంపతులు పెళ్లి చేసుకున్నారు. అలా కట్టునాయకన్ తెగ సంస్కృతినీ తెలియజేసే అవకాశం వచ్చింది’’ అని తెలిపింది. ఇక 36 ఏళ్ల కార్తికి మొదటి సినిమాకే ఆస్కార్ అవార్డు రావడం గొప్ప విశేషం. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాకు నిర్మాతా ఓ మహిళే. ఇక మూవీ కోసం పనిచేసింది ముగ్గురే వ్యక్తులు. మరి ఆస్కార్ అవార్డు సాధించిన ఈ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి