ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన, చంద్రబాబు కంటతడి ఎపిసోడ్ ఈ రెండు ఘటనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు నాయుడు భార్యపై వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడారని చంద్రబాబు మీడియా సమక్షంలో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై రాజకీయ పార్టీలకు అతితంగా కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
అయితే దీనిపై నందమూరి కుటుంబంలోని ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. బాలక్రిష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరి వంటి వ్యక్తులు స్పందించారు. అయితే తాజాగా సినీ నటుడు నారా రోహిత్ సైతం స్పందిస్తూ చిత్తూరు జిల్లాలోని తాత, నానమ్మ సమాధి వద్ద మౌన నిరసన తెలియజేశారు. ఇక నిరసన అనంతరం మాట్లాడిన ఆయన.. క్రమ శిక్షణకు మారు పేరు పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు లోకేశ్ అని రోహిత్ అన్నారు. పెద్దమ్మ సేవలే పరమావధిగా పని చేస్తున్నారని అలాంటి వ్యక్తిపై నోటికొచ్చినట్లు మాట్లాడడం మీకు నోరెలా వచ్చిందని నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు కూడా మా పెద్దమ్మ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, మా కుటుంబంలోని వ్యక్తులు ఎలాంటి అవినీతి ఆరోపణల్లో కూడా వేలుపెట్టలేదని నారా రోహిత్ తెలిపారు.