టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి నారావారి కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది.
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నారా కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది. తిరుమల కొండ మీద ఒకరోజు అన్నప్రసాద వితరణకు గానూ రూ.33 లక్షల విరాళాన్ని లోకేష్, బ్రాహ్మణి దంపతులు అందజేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని లోకేష్ దంపతులు కేటాయించారు. ప్రతి ఏడాది దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్నదాన వితరణకు అయ్యే ఆ మొత్తం వ్యయాన్ని విరాళంగా ఇస్తూ వస్తోంది నారావారి కుటుంబం. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు.
తరిగొండ వెంగమాంబ నిత్య ప్రసాద వితరణ కేంద్రం భవనంలో నారా దేవాన్ష్ పేరు మీదుగా ప్రతి ఏడాది ఈ ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నిత్య ప్రసాద వితరణ కేంద్రంలోని డిస్ ప్లే బోర్డులో దేవాన్ష్ పేరు కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే టీటీడీ అన్న ప్రసాద వితరణకు ఇలా విరాళాలు ఇస్తుండటం కామనే. కొందరు భక్తులు అన్న ప్రసాదానికి విరాళాలు ఇచ్చి తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటూ ఉంటారు. చంద్రబాబు కుటుంబం గతంలో స్వయంగా ఒకసారి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.