దసరా సినిమా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని మాస్ హిట్ సాధించిన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. దసరా విజయానికి, జగన్‌ను విమర్శించడానికి సంబంధం ఏంటి అంటే..
నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది దసరా సినిమా. తొలిసారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. దసరా సినిమాలో కీర్తి సురేష్.. నానికి జోడిగా నటించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజైంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రీరామనవమి పండుగ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దసరా సినిమా కలెక్షన్లు.. నాని కెరీర్‌లోనే బెస్ట్ నెంబర్స్ కలెక్ట్ అవుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తొలి రోజునే రూ.38 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసిన దసరా సినిమాకు.. రెండో రోజున దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే రెండు రోజుల్లోనే నాని సినిమా దాదాపు రూ.53 కోట్లు (రూ.52.40 కోట్లు) గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచాన వేస్తున్నాయి.
చాలా కాలం తర్వాత దసరా సినిమాతో నాని సాలిడ్ హిట్ కొట్టాడు. దీనికి ముందు వచ్చిన అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ కాగా.. శ్యామ్ సింగరాయ విమర్శకులు ప్రశంసలు అందుకుంది కానీ.. కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన మేర రాణించలేదు. ఇక శ్యామ్ సింగరాయ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు నిర్ణయిస్తూ.. తీసుకున్న నిర్ణయంపై నాని స్పందిస్తూ.. కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశాడు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించిన సమయంలోనే నాని నటించిన శ్యామ్ సింగరాయ చిత్రం విడుదలైంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తన సినిమా కలెక్షన్లు తగ్గుతాయని భావించిన నాని.. గవర్నమెంట్ తీసుకువచ్చిన ప్రకారం సినిమా టికెట్లు అమ్మితే.. చాలా నష్టపోతామని.. ఈ ధరలతో టికెట్లు అమ్మి.. థియేటర్ నడపడం కన్నా.. కిరాణ షాపు నడుపుకోవడం బెటర్ అని.. వాళ్ల సంపాదనే బాగుంటుంది అని కామెంట్స్ చేశాడు.
దీనిపై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. నానిపై ఘాటు విమర్శలు చేయడమే కాక.. తన సినిమాలు చూడవద్దని పిలుపునిచ్చారు. నాని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది. తర్వాత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించారు.. ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.
ఇక దసరా భారీ విజయం సాధించిన నేపథ్యంలో కొందరు నెటిజనులు పని గట్టుకుని.. ముగిసిపోయిన వివాదాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. అప్పుడు నానిని ఓ రేంజ్‌లో విమర్శించారు.. ఇప్పుడు చూడు తన సినిమా ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో.. అంటూ.. ఏపీ సీఎం జగన్‌ను ఈ వ్యవహారంలోకి లాగి పాత వివాదాన్ని మళ్లీ తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాని హిట్ కొట్టడంతో.. ఇది కూడా జగన్‌కి ఎదురు దెబ్బ అని పని గట్టుకుని కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజనులు. అసలు సందర్భం లేకుండా ఈ వివాదాన్ని మళ్లీ తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతించారు.. కొందరు విమర్శించారు. వారి వారి పరిస్థితులను బట్టి నాడు స్పందించారు. ఆ తర్వాత ప్రభుత్వం-సినీ ఇండస్ట్రీల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. సినిమా పరిశ్రమకు మేలు చేయడం కోసం ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవడమే కాక.. రాయితీలు కూడా ప్రకటించింది. ఇప్పుడంతా బాగున్న సమయంలో.. కొందరు పాత వివాదాలను తెర మీదకు తెస్తూ.. వివాదాన్ని రాజేసే పనిలో ఉన్నారు. వీరిపై ఇటు నాని అభిమానులు, అటు వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ బాగుంటే మీరు చూసి ఓర్చుకోలేరా అని తిట్టి పోస్తున్నారు. మరి ఈ పరిణామంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.