ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా దీనిపై స్పందిస్తూ.. తమ్మారెడ్డిని విమర్శించారు. ఇక దీనికి సంబంధించి తమ్మారెడ్డి-నాగబాబుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా తమ్మారెడ్డికి క్షమాపణ చెప్పారు నాగబాబు. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్కి ఆస్కార్‌పై తెలుగు ఇండస్ట్రీలో పెను వివాదం నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ప్రాంరభమైంది. దీనిపై నాగబాబు, రాఘవేంద్ర రావు స్పందిస్తూ.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ విషయంలో నాగబాబు, తమ్మారెడ్డిల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. చాలా మంది తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. తెలుగు సినిమా ఆస్కార్ వరకు చేరడం అంటే ఎంత గొప్ప విషయం మీరు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ తమ్మారెడ్డిపై మండి పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నాగబాబు మరోసారి తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్షమాపణలు చెబుతూనే.. ‘‘పెద్దవారు ఇలా మాట్లాడటం సరి కాదు.. చాన్నాళ్లుగా మీరు విమర్శలు చేస్తున్నారు.. వద్దులే అని ఊరుకున్నాను. కానీ ఇక మీదట అలా కాదు జాగ్రత్త’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది అంటే గర్వ పడాలి. ఆస్కార్ వస్తే.. తెలుగోడు తలెత్తుకుంటాడు. ఒకవేళ రాకపోయినా పర్లేదు.. మనం పోటీలో ఉన్నాం అని గర్వంగా చెప్పుకోచ్చు. అసలు తెలుగు సినిమా పాట ఆస్కార్ వరకు వెళ్లింది అంటేనే ఎంతో గొప్ప. ఇదిరా మన తెలుగోడి సత్తా.. ఇదిలా మా ఇండియన్స్ ప్రతిభ అంటూ గర్వంతో జబ్బలు చరుచుకోవాలి. కానీ మీరు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉన్నందుకు కుళ్లుకుని చచ్చిపోతున్నారు. మళ్లీ మైక్ ముందుకు వస్తే.. గొప్ప గొప్ప నీతులు చెబుతారు. మన తెలుగు సినిమా అని గర్వపడాల్సింది పోయి విమర్శిస్తారా. ఆర్ఆర్ఆర్ సినిమాకి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారా.. మీరు చూశారా.. అసలు మీకేం సంబంధం.. ఎందుకంత విషం కక్కుతున్నారు. మీరు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా’’ అంటూ మండి పడ్డారు.
‘‘ఆ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో చూశారా.. మనం కూర్చుంటే లేవలేం.. మోకాళ్లు పని చేయవ్. మరి వాళ్లు ఎలా డ్యాన్స్ చేశారో చూశారు కదా. వీలైతే యంగ్‌స్టర్స్‌ని ప్రోత్సాహిద్దాం.. అంతేకానీ మనల్ని మనం ఇలా కించ పర్చుకోకూడదు. మీరు ఇంతకు ముందు ఎన్ని విమర్శలు చేసినా రియాక్ట్ కాలేదు. పోనిలే ఏదో మాట్లాడుతున్నారు అని ఊరుకున్నాం. కానీ ఆస్కార్ విషయంలో కూడా ఇంత విషం కక్కుతారా. భరద్వాజ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మళ్లీ ఇది రిపీట్ అయితే కౌంటర్ ఉంటుంది. మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్లు.. గౌరవంగా చెప్తున్నా.. భరద్వాజా గారూ.. ప్లీజ్ నోరు అదుపులో పెట్టుకోండి’’ అంటూ కూల్‌గా కౌంటర్ ఇచ్చారు నాగబాబు.
‘‘అందరూ మెచ్చుకున్న దాన్ని మనం విమర్శిస్తే పాపులర్ అయిపోతాం అనే పనికిమాలిని పబ్లిసిటీ స్టంట్ ఎందుకు. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పటికైనా మీరు కళ్లు తెరిచి.. బుద్ది తెచ్చుకుంటారని అనుకుంటున్నా. ఇప్పటికే బయట మీ గురించి చాలా దారుణంగా అనుకుంటున్నారు. నా కౌంటర్‌కి మీరు మళ్లీ రియాక్ట్ అవ్వాలనుకుంటే.. అవ్వండి. మీరు ఏ రేంజ్లో రియాక్ట్ అయితే.. నేను దానికి లక్షరెట్లు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతా. గత ఐదేళ్లుగా సైలెంట్‌గానే ఉన్నా.. ఇక మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే అంత మంచితనం నాకు లేదు. ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది. జాగ్రత్త.. మీకు నమస్కారం.. ఏదైనా పొరపాటు మాట్లాడి ఉంటే.. క్షమించండి. మీరు నాకంటే పెద్దవారు.. క్షమించండి’’ అంటూనే తమ్మారెడ్డిని కూల్‌గా ఉతికి ఆరేశారు నాగబాబు. మరి తమ్మారెడ్డిపై నాగాబాబు చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.