యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఆయనకు అమ్మాయిల్లో అభిమానులు ఎక్కువ. కిల్లింగ్ లుక్స్‌తో లేడీ ఫ్యాన్స్ మనసుల్ని ఆయన దోచుకుంటున్నారు. అలాంటి చైతూ ఒక విషయంలో మాత్రం ఎప్పటికీ బాధపడుతుంటానని అంటున్నారు.
అక్కినేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిలో హ్యాండ్సమ్ హంక్ నాగ చైతన్య ఒకరు. నటనతో పాటు తన లుక్స్‌తోనూ ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించారాయన. తెరంగేట్రం చేసిన తొలి చిత్రం ‘జోష్’తోనే తనలో మంచి నటుడు ఉన్నారని చైతూ నిరూపించుకున్నారు. ఆ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదు. కానీ ఆ తర్వాత చేసిన ‘ఏ మాయ చేశావే’ మూవీతో హిట్ కొట్టారు చైతూ. ఈ ఫిల్మ్‌తో ఆయన అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. అనంతరం ‘100 పర్సెంట్ లవ్’, ‘తడాఖా’, ‘మనం’, ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తున్నారాయన. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో జోరు పెంచారు చైతూ.
తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కస్టడీ’లో యూత్ హార్ట్ త్రోబ్ కృతీ శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది మూవీ టీమ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. తన లైఫ్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ‘నా జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు. ఎదురైన ప్రతి సంఘటన నాకో పాఠం నేర్పింది. అయితే కొన్ని చిత్రాల విషయంలో బాధపడ్డా. వాటి మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. ఆ ఒక్క విషయంలో బాధపడుతుంటా. మూడు సినిమాల విషయంలో ఇలా జరిగింది’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.