బండబారిన మనసుని, మోడు బారిపోయిన జీవితాన్ని కదిలించగల, మార్చగల సత్తా ఒక సంగీతానికి మాత్రమే ఉంది. ఆ సంగీతం నుంచి వచ్చే సాహిత్యానికి పరవశించిపోని మనిషి ఉండరు. రోజంతా ఒళ్ళంతా హూనం చేసుకుంటూ కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాక.. స్నానం చేసి ఆరుబయట అరుగు మీదనో, లేక నులక మంచం మీదనో కూర్చుని పాటలు వింటా ఉంటే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. ఆటోడ్రైవర్లు తమ ఆటోల్లో రొమాంటిక్ సాంగ్స్, మాంచి ఊపొచ్చే పాటలు వినకపోతే వాళ్ళ ఆటోలు కదలవు. కాలేజ్ యూతు, ఎస్టీడీ బూతు అని తేడా లేకుండా అందరూ సాంగ్స్ అంటే వెర్రెక్కిపోతారు.
కంప్యూటర్లో బుర్రలు పెట్టి బద్దలు కొట్టుకునే కార్పొరేట్ ఉద్యోగులు సైతం సాయంత్రం అయ్యాక ఈ సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతారు. మాస్ మసాలా సాంగ్ అవ్వని, ఐటమ్ సాంగ్ అవ్వని, మాంచి ఫీల్ కలిగించే లవ్ సాంగ్ అవ్వని, ఎమోషనల్ సాంగ్ అవ్వని.. ఏ సాంగ్ అయినా గానీ విన్న సాంగ్ నే పదే పదే వినడం, చూసిన పాటనే పదే పదే వినడం ఒక వ్యసనంలా అయిపోయింది. ఇంట్లో, బాత్రూంలో, ప్రయాణంలో ఎక్కడ చూసినా సినిమా పాటలే. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే డీజే లేకపోతే ఆ ఫంక్షన్ కి కళ రాదు. అంతలా మన జీవితాల్లో ఒక భాగమైపోయిన పాట గురించే ఈ ఆర్టికల్. 2022లో యూట్యూబ్ పాటల పల్లకిలో ఊరేగిన టాప్ 10 సాంగ్స్ ఏంటో ఓపాలి రివైండ్ చేసుకుందాం.
ఈ ఏడాది మన తెలుగులో వచ్చిన నాటు నాటు, డీజే టిల్లు పాటలు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేశాయి. ఇవే కాదు సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, బంగార్రాజు, ది వారియర్, ధమాకా, సీతారామం, విక్రాంత్ రోణ వంటి సినిమాల పాటలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సాంగ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమాలోని కళావతి, డీజే టిల్లు టైటిల్ సాంగ్, ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు ఇలా టాప్ 1 నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న పాటలు ఉన్నాయి. మరి 2022 లో యూట్యూబ్ లో యూజర్లు అత్యధికంగా విన్న, కన్న వీడియో సాంగ్స్ ఏంటో ఓపాలి రివైండ్ ఏసుకుందాం.
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా వచ్చిన ఈ సినిమాలో కళావతి పాట ఒక ఊపు ఊపేసింది. ఈ లిరికల్ సాంగ్ కి 237 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
డీజే టిల్లు సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా అలానే ఉంది. ఎక్కడ చూసినా డీజే టిల్లు మ్యానియానే. ‘టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కైతే 220 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఏ పార్టీ జరిగినా ఈ సాంగ్ ఖచ్చితంగా ప్లే చేయాల్సిందే. అంతలా ఈ పాట పాపులర్ అయిపోయింది.
పైన ఫుల్ సాంగ్.. ఇది లిరికల్ సాంగ్. ఈ లిరికల్ సాంగ్ కి 166 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లని బిగ్ స్క్రీన్ మీద చూస్తే ముచ్చటగా ఉంటుంది. ఇక ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే కన్నుల విందుగా ఉండకుండా ఉంటుందా? యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయకుండా ఉంటుందా? నాటు నాటు పాటకి చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ని.. ఇండియా మొత్తం ఇమిటేట్ చేసింది. అంతలా ఈ పాట అందరికీ తెగ నచ్చేసింది. ఎవరి నోట విన్నా ఈ పాటే.. ఎవరి టీవీల్లో చూసినా, ఎవరి ఫోన్లలో చూసినా ఈ పాటే. అంతలా అందరినీ మైమరిపించిన ఈ పక్కా నాటు పాటకి యూట్యూబ్ లో 139 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన ది వారియర్ సినిమాలోని బుల్లెట్ సాంగ్ పాట ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది యూట్యూబ్ ని షేక్ చేసిన పాటల్లో ఈ బుల్లెట్ పాట ఒకటి. ‘కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు’ అంటూ సాగే ఈ బుల్లెట్ ప్[పాటకి 130 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నాటు నాటు లిరికల్ సాంగ్ కి 139 మిలియన్ వ్యూస్ వస్తే.. ఈ ఫుల్ వీడియో సాంగ్ కి 109 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఒక హైవోల్టేజ్ సినిమా. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా. ఇక ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ఐతే ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. భీమ్ భీమ్ భీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాట 104 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని ‘రా రా రెడ్డి’ పాట మాస్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఉర్రూతలూగించింది. ఈ సాంగ్ మధ్యలో రాను రానంటూనే చిన్నదో అంటూ వచ్చే బీట్స్, లిరిక్స్ పాటని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. అంజలి నర్తించిన ఈ పాట.. యూట్యూబ్ లో 80 మిలియన్ వ్యూస్ వరకూ వెళ్ళింది.
నాగచైతన్య, కృతి శెట్టి జంటగా వచ్చిన ఈ సినిమాలోని బంగారా పాట బాగా వినబడింది. అందరి నోటా నలిగింది. బంగారా బంగారా అంటూ సాగే ఈ పాటకి యూట్యూబ్ లో 77 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎన్టీఆర్ నట వైభవానికి మెంటల్ వచ్చేస్తుంది. ఈ పాటలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన నభూతో న భవిష్యతి. హావభావాలతో ఎన్టీఆర్, సంగీతంతో కీరవాణి, సాహిత్యంతో సుద్దాల అశోక్ తేజ్, గాత్రంతో కాలభైరవ అందరూ ఏడిపించేశారు. అంతలా హృదయానికి హత్తుకుపోయిన ఈ పాట 68 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది.
వ్యూస్ పక్కన పెడితే.. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో చాలా పాటలు సంగీత ప్రియులను అలరించాయి. సీతారామం సినిమాలో ఓ సీత పాట, ఇంతందం పాట.. ఓరిదేవుడా సినిమాలో బుజ్జమ్మ బుజ్జమ్మ, గుండెల్లోన గుండెల్లోన పాటలు, తిరు సినిమాలో నా మది పువ్వది వాడిపోతూ ఉన్నది పాట.. ధమాకా సినిమాలోని జింతక జింతక, విక్రాంత్ రోణ సినిమాలోని రారా రక్కమ్మ, గాడ్ ఫాదర్ సినిమాలోని తార్ మార్ తక్కర్ మార్, ఆచార్య సినిమాలోని సానా కష్టం వచ్చిందే మందాకినీ పాట ఇలా చాలా పాటలు ఉర్రూతలూగించాయి. మరి మీ మనసుకి బాగా నచ్చిన పాట ఏంటో కామెంట్ చేయండి.