ఒక స్టార్ హీరో సినిమా తెరకెక్కుతున్నా లేదా ఒక సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు మరో సినిమా డైరెక్ట్ చేస్తున్నా లేదా ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ హీరోలు స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా.. కొత్త కాంబినేషన్ లో సినిమా వస్తున్నా.. ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఆయా సినిమాలపై భారీ హైప్ ఏర్పడుతుంది. టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా.. సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ చూసినా.. బొమ్మ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి అని ఆయా హీరోల అభిమానులు సందడి చేస్తారు. అయితే టీజర్, ట్రైలర్ లో ఉన్న మేటరు.. సినిమాలో లేకపోతే అభిమానులకి నిరాశే మిగులుతుంది.
2022 వెళ్లిపోవడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. 22 పోయి 23 వస్తుంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2022లో జరిగినవన్నీ ఒకసారి నెమరు వేసుకుంటే.. ఎన్నో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఉంటాయి. ఒక అభిమానిగా అభిమాన హీరో సినిమా చూసి నిరాశ చెందిన అనుభవాలు ఉంటాయి. మరి ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాలేంటో చూద్దాం.
విజయ్ దేవరకొండ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో. మరోపక్క సాలిడ్ హిట్ కోసం ఆకలి మీద ఉన్న పూరీ జగన్నాథ్. ఈ సినిమాకి ఈ ఇద్దరూ కసి తీరా పని చేశారు. దీనికి తోడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. దీంతో మన విజయ్, పూరీ బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొడతారని అనుకున్నారు. కానీ అక్కడే కాకుండా ఇక్కడ కూడా నిరాశపరిచింది. ఆ కరణ్ జోహార్ బాలీవుడ్ ఫ్లేవర్ ఉండడం వల్ల సినిమా మిస్ ఫైర్ అయ్యిందన్న కామెంట్స్ వినిపించాయి.
ఇలా భారీ అంచనాలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అభిమానులను సంతృప్తిపరచడంలో ఆ సినిమాలు విఫలమయ్యాయి. 2022లో భారీ అంచనాలతో రిలీజైన సినిమాల్లో ఆచార్య సినిమా ఒకటి. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్.. మరోపక్క బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్. సాధారణంగా కొరటాల శివ అంటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. కంటెంట్ తోపు ఉంటుందని నమ్మకం. కాబట్టి ఆచార్య మీద కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొరటాల శివ గ్రాఫ్ చూసుకుంటే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఆచార్య సినిమాతో అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన ప్రభాస్.. ఆ తర్వాత తీసిన రెండు సినిమాలూ ఫ్లాపులుగా నిలిచాయి. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ తప్పదన్న సెంటిమెంట్ అయితే ఉంది. జనాలు కూడా ఆ సెంటిమెంట్ నే బాగా నమ్ముతారు. ప్రభాస్ రెండు సినిమాలు చేశారు కాబట్టి 2019లో వచ్చిన సాహో, 2022లో వచ్చిన రాధే శ్యామ్ సినిమాలు బాహుబలి స్థాయిలో ఆడలేదు. పీరియడ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ గా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే చేసిన మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. కానీ విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.
మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరున్న ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాకి కూడా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉండేవి. తెలుగులో కూడా ఈ సినిమాకి భారీగా ప్రమోట్ చేశారు. ఆమిర్ ఖాన్ హైదరాబాద్ వచ్చి మరీ తన సినిమా చూడమని రిక్వస్ట్ చేశారు. మెగాస్టార్ స్వయంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సమర్పకుడిగా కూడా ఉన్నారు. అయితే హాలీవుడ్ వాసన మనవాళ్ళకే కాదు, బాలీవుడ్ వాళ్లకి కూడా రుచించలేదు. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన చారిత్రాత్మక సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. రాజ్ పుత్ రాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
చాలా కాలం గ్యాప్ తర్వాత రణబీర్ కపూర్ షంషేరా సినిమాతో వచ్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కథ, విజువల్ పరంగా బాగున్నా కథనం చప్పగా ఉండటం వల్ల నిరాశపరిచింది.
కింగ్ నాగార్జున నటించిన సినిమాల్లో ఇదొక బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. కథ, కథనం అంతా చాలా బాగుంటుంది. ఎందుకో గానీ ఈ సినిమాని జనాలు ఆదరించలేదు. బాగున్నా సినిమా అయినా కూడా జనాలు ఎందుకు చూడలేదో అనేది అర్థం కాని విషయం.
నాని సినిమాలు కొత్తగా ఉంటాయి, బాగా ఆడతాయి అనుకున్న ప్రతిసారీ ఈ ప్రూవ్డ్ దెమ్ రైటండి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది రాంగ్ అయ్యిందండి. రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ మూవీపై రిలీజ్ కి ముందు వరకూ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రేక్షకులు అనుకున్నంతగా ఈ సినిమా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా క్రేజ్ ఉంది. రెమో, శక్తి, వరుణ్ డాక్టర్, డాన్ వంటి సినిమాలతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. విభిన్నమైన కంటెంట్ తో వస్తారన్న అభిప్రాయం ఉంది శివకార్తికేయన్ పై. ఇక ఫుల్ లెంత్ కామెడీ డోస్ తో కడుపుబ్బా నవ్వించే సినిమా జాతిరత్నాలు తీసిన దర్శకుడు అనుదీప్ తో.. శివకార్తికేయన్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. అంతకు ముందు వరుణ్ డాక్టర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో వచ్చిన కామెడీ సన్నివేశాలు చూసి కడుపుబ్బా నవ్వుకున్న జనం.. వీరి కాంబినేషన్ లో మూవీ కూడా అదే స్థాయిలో ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రిన్స్ మూవీ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. వరుణ్ డాక్టర్ సినిమాలో కామెడీతో పాటు కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ప్రిన్స్ విషయంలో కామెడీ ఉన్నా కథలో లోపం వల్ల మిస్ ఫైర్ అయ్యింది.
రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్ సినిమాపై కూడా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. పందెం కోడి, ఆవారా, అంజాన్ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన లింగుసామి డైరెక్షన్ లో రామ్ హీరోగా సినిమా వస్తుందంటే ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ది వారియర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది.
రవితేజ నటించిన ఖిలాడీ సినిమాపై రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి గ్లామర్ కూడా సినిమాని గట్టెక్కించలేకపోయింది.
ఈ కోవలోనే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం, రానా నటించిన విరాట పర్వం, గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్, దళపతి విజయ్ నటించిన బీస్ట్, నాగచైతన్య నటించిన థాంక్యూ, పొన్నియిన్ సెల్వన్ (తెలుగు), శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు, కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడిని, శ్రీ విష్ణు నటించిన భళా తందనానా వంటి సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇవి కాకుండా మీ దృష్టిలో భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచిన సినిమాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి.