‘మా’ ఎన్నికలు.. మునుపెన్నడూ లేని విధంగా రచ్చకెక్కాయి. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, యువ కథానాయకుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడ్డారు. లోకల్-నాన్‌లోకల్, క్రమశిక్షణ, వయసు, అనుభవం, కుటుంబం లాంటి అంశాలతో ఒకరిపై ఒకరు, వారివారి ప్యానల్ సభ్యులు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. నామినేషన్ల సమయంలో ఏకంగా ర్యాలీ కూడా తీశారు. ఇక పోలింగ్ రోజు అయితే దాడులు, గొడవలు కూడా జరిగాయి. ఇలా రాజకీయ ఎన్నికలను తలపిస్తూ సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు.
ఇంతటితో ఈ అనవసరపు రచ్చకు తెరదిగుతుందని అందరూ భావించారు. కానీ అనంతరం మా సభ్యత్వానికి కొంతమంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం. ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. ఇక వీటిపై స్పందించని విష్ణు తన ప్రమాణ స్వీకార కార్యక్రమంపై పూర్తి దృష్టి పెట్టాడు. దానికోసం సినీ పరిశ్రమలో తన గెలుపుకు సహకరించిన పెద్దలను కలుస్తూ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు. నందమూరి బాలకృష్ణ ఇంటికి స్వయంగా మోహన్‌బాబు, మంచు విష్ణు కలిసి వెళ్లి మరీ ఆయనను ఆహ్వానించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారా? అనే మీడియా ప్రశ్నకు మంచు విష్ణు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
కానీ, శనివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాలేదు. చిరంజీవికి ఆహ్వానం అంది ఇతర కారణాలతో హాజరు కాలేదా? లేక మంచు విష్ణు చిరంజీవిని ఆహ్వానించలేదా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కాగా మంచు విష్ణు, మోహన్‌బాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించిన బాలకృష్ణ కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు. మోహన్‌బాబు పెద్దగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికలకు ముందు విష్ణు.. సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజులను కూడా కలిశారు. వారు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇంతటి ఉత్కంఠ మధ్య సాగిన మా ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు తండ్రి మోహన్‌బాబు తప్పితే ఇండస్ట్రీ పెద్దలు లేకుండానే ప్రమాణ స్వీకారం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.