శరీరాకృతి విషయంలో మగవారి కన్నా ఎక్కువగా ఆడవారు విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మగాళ్లు ఎలా ఉన్నా పర్లేదు చల్తా అన్నట్లు ఉంటారు.. అదే ఆడవారి విషయానికి వస్తే.. రంగు, రూపు, ఆకృతి.. ఇలా ప్రతి దాన్ని పట్టి పట్టి చూస్తారు. ఏదో ఒక విషయంలో వంక పెడుతూనే ఉంటారు. ఇక నటీమణుల విషయంలో ఈ విమర్శలు మరి కాస్త ఎక్కువే వినిపిస్తాయి. వారు కాస్త ఒళ్లు చేసినా.. అవకాశాలు తగ్గుతాయి.. ఇటు అభిమానులు కూడా విమర్శలు చేస్తారు. అందుకే సెలబ్రిటీలు లైమ్ లైట్లో ఉన్నా లేకపోయినా సరే తమ ఫిజిక్ గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. మరీ జీరో సైజ్ కాకుండా.. ఎవరికి వారు ఫిట్‌గా ఉంటే సరిపోతుంది.
ఇక శరీకాకృతి విషయంలో విద్యా బాలన్, నిత్యా మీనన్ వంటి వారిపై అనేక విమర్శలు వచ్చాయి. కానీ వారు మాత్రం విమర్శలను పట్టించుకోకుండా.. మా ఆరోగ్యం మాకు ముఖ్యం అని తేల్చి చెప్పారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఇలా బాడీ షేమింగ్ ఎదుర్కొంది. అది కూడా పాపం.. శుభమా అని పెళ్లి చేసుకుంటున్న రోజునే. వివాహానికి హాజరైన కొందరు.. సదరు హీరోయిన్ లావుగా ఉందని విమర్శించారట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది.
కొన్ని రోజుల క్రితమే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నటి మంజిమా మోహన్. నటుడు గౌతమ్ కార్తిక్‌ను వివాహం చేసుకుంది. మూడేళ్ల తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. పెళ్లి తర్వాత తొలిసారి మీడియాతో ముచ్చటించింది నవ వధువు మంజీమా మోహన్. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలానే తన శరీరాకృతిపై వచ్చిన విమర్శలను కూడా ఈ సందర్భంగా వెల్లడించింది మంజిమా మోహన్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పెళ్లి ఫోటోల్లో నేను లావుగా ఉన్నానని విమర్శలు వచ్చాయి. నిజానికి.. మా పెళ్లికి వచ్చిన కొందరు.. నేను లావుగా ఉన్నానని కామెంట్స్ చేశారు. అయితే శరీరాకృతి విషయంలో.. నేను ఎంతోకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నాను. ప్రారంభంలో ఇలాంటి విమర్శలు విని.. ఎంతో బాధపడ్డాను. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేశాను. ప్రస్తుతం నేను ఎంతో ఫిట్‌గా.. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలని అనిపించినప్పుడు తప్పకుండా తగ్గుతాను. వివాహం తర్వాత కూడా నటిగానే కెరీర్‌ను కొనసాగిస్తాను. మంచి కథల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను’’ అని తెలిపింది.
కోలీవుడ్‌లో తెరకెక్కిన దేవరట్టం సినిమాలో తొలిసారి గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అనంతరం ప్రేమలో పడ్డారు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు.. తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు.
Favourite ❤️ #GauthamKarthik #ManjimaMohan #Couple #CoupleGoals #Love pic.twitter.com/dvr9AsXGmv
— Gautham Karthik’s Srilankan Fan (@gauthamfan) November 28, 2022
పెళ్లిలో నన్ను విమర్శించారు.. లావుగా ఉన్నానని కామెంట్స్ చేశారు: మంజిమా మోహన్