టాలీవుడ్ లో ఇంకా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం నలుగుతూనే ఉంది. ఏపీలో రేట్లు తగ్గించడంపై మిశ్రమ స్పందనలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడంపై కూడా మిశ్రమ స్పందనే వచ్చింది. ఈ విషయంపై సినిమా రంగంలోని పెద్దలు, ముఖ్యలు చాలా మంది స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలిసి సినిమా వాళ్ల కష్టాలను, టికెట్ ధరల తగ్గింపుపై ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది. సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తొలిసారి మీడియాతో మాట్లాడారు.
ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల విషయంపై తిరుపతిలో మంచు విష్ణు స్పందించారు. సీఎం జగన్- చిరంజీవి భేటీ పూర్తిగా వారి వ్యక్తిగత సమావేశమని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ‘సినిమా టికెట్ రేటును ఏపీలో తగ్గించడం కరెక్టా? తెలంగాణలో రేటు పెచండం కరెక్టా అంటే పెద్ద డిబేట్ అవుతుంది. రెండు చోట్లా ఆ విషయంపై కోర్టుకెళ్లారు. పెంచడం కరెక్టా? తగ్గించడం కరెక్టా? అంటే నేను చెప్పలేను. ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి రావాలి. మా సమస్యలను ముక్త కంఠంతో చెప్పాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంపై అందరూ చర్చించుకుంటున్నాం. ఎవరో ఒక్కరు, ఇద్దరు మాట్లాడి వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించలేము. చర్చలు జరుగుతున్నాయి.. అందరి ఏకాభిప్రాయంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయంతో ముందుకెళ్తాం. సొల్యూషన్ తేలిగ్గా వస్తుందని భావిస్తున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులను కలిసింది. మమ్మల్ని వ్యక్తిగతంగా కలవమన్నా కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇండస్ట్రీకి సమస్య ఉన్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేశ్ అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. మా జనరేషన్ కు పెద్దవారిగా మమ్మల్ని గైడ్ చేస్తారు’ అంటూ మంచు విష్ణు స్పందించారు. రెండు ప్రభుత్వాలతో చర్చిస్తే.. ఈ సమస్యకు ఈజీ సొల్యూషన్ వస్తుందని మంచు విష్ణు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.