తెలుగులో నటులకు వారసులు ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువనే చెప్పవచ్చు. అలా తండ్రి వారసత్వాన్ని తీసుకుని నటనలోకి వచ్చిన వారిలో ఒకరు మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హలీవుడ్ లో పరిచయం అయినప్పటికీ.. తెలుగులో నటించాలన్న ఆశతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. తొలి చిత్రంలోనే విలన్ పాత్రలో మెప్పించారు. అప్పటి నుండి సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ, పలు షోలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇటీవల మలయాళ చిత్రం మాన్‌స్టర్ లో చేసిన పాత్ర విమర్శకులు ప్రశంసలను సైతం అందుకుంది.
ఈ చిత్రంలో మంజు దుర్గ అనే పాత్రలో నటించి మెప్పించారు మంచు వారమ్మాయి. ఈ సినిమాలో ఆమె రెండు షేడ్లలో కనిపిస్తారు. చివరిలో ఆమె క్యారెక్టర్ (లెస్బియన్)ను చూసిన వారంతా ఆశ్చర్యపోక మానరు. ఈ పాత్రకు గానూ ఆమెకు ఓ అవార్డు లభించింది. హలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్-సౌత్ 2023లో ‘బెస్ట్ వెర్సటైట్ యాక్టర్’గా అవార్డు దక్కింది. ఈ అవార్డు తీసుకున్న వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
‘ఎంతో శక్తివంతమైన, సానుకూలమైన రోజు. నన్ను ఈ ఏడాది వెర్సటైల్ యాక్టర్ గా గుర్తించిన హలో మాగ్ ఇండియా కు ధన్యవాదాలు. నా ఎదుగుదల చూసిన స్నేహితులు, ఆత్మీయుల మధ్య ఈ అవార్డును తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ రోజును మీతో కలిసి పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం అనే చిత్రంలో నటిస్తున్నారు.