ఘట్టమనేని కుటుంబానికి, వారి అభిమానులకు 2022 సంవత్సరం తీరని కష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది మహేశ్ కుటుంబంలో ఏకంగా మూడు మరణాలు సంభవించాయి. ముందుగా అన్నని, తల్లిని కోల్పోయిన మహేశ్.. తాజాగా తండ్రిని కూడా కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. దీంతో.. ఇప్పుడు మహేశ్ కి వచ్చిన కష్టాన్ని చూసి అంతా చలించిపోతున్నారు. అయితే.. ఇంతటి బాధలో కూడా సూపర్ స్టార్ మహేశ్ ఆ ఇంటి పెద్దగా తన బాధ్యతని నిర్వర్తిస్తుండటం గొప్ప విషయం. నిజానికి కృష్ణ మరణం కారణంగా అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది రమేశ్ బాబు కుటుంబ సభ్యులు. ఘట్టమనేని రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8న కన్నుమూశారు. సెప్టెంబర్ 28న అనారోగ్య సమస్యతో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. మంగళవారం 15న సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇలా.. ఒకే ఏడాదిలో తండ్రిని, నానమ్మని, తాతయ్యని కోల్పోయి రమేశ్ బాబు బిడ్డలు పెద్ద దిక్కుని కోల్పోయినట్టు అయ్యింది. ఇక రమేశ్ బాబు భార్య మృదుల కష్టాన్ని అయితే.. మాటల్లో వర్ణించడం కష్టం. ఇంతటి కష్ట సమయంలోనే మహేశ్.. తన అన్న కుటుంబానికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది.
రమేష్ బాబు కొడుకు జయకృష్ణ విదేశాల్లో ఉంటున్న కారణంగా తాతయ్య చివరి చూపుకు నోచుకోలేకపోయాడు. అయితే.. అంత్యక్రియలు ముగిసిన తరువాత.. 17వ తేదీ జరిగిన చిన్న కర్మలో రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ, కూతురు భారతి, భార్య మృదుల పాల్గొని కృష్ణకి నివాళులు అర్పించారు. ఈ సమయంలో వారితో మహేశ్ వెన్నంటే ఉండి దైర్యం నింపుతూ కనిపించాడు. అంతే కాదు.. తన అన్న కొడుకు, కూతురు జయకృష్ణ, భారతితో కాసేపు మాట్లాడి.. కృష్ణ చిత్రపటం వద్ద కొన్ని ఫోటోలు కూడా దిగాడు. ఇదే సమయంలో భారతిని కూడా ముద్దు చేస్తూ కనిపించాడు మహేశ్.
ఇక రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పుడు విదేశాల్లో చదువుని కొనసాగిస్తున్నాడు. దీంతో.. అన్న ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడు మహేష్ బాబు తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ బాధ్యతలు తీసుకోవడం అంటే.. రమేశ్ బాబు కుటుంబానికి కష్టాలు ఉండి, వాటిని మహేశ్ తీర్చడం కాదు. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నిలవడం. రేపటి రోజున జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా, భారతి పెళ్లి వ్యవహారం చూడాలన్నా బాబాయ్ గా మహేష్ దే బాధ్యత. ఈ విషయంలోనే మహేశ్ తన వదినకి దైర్యంగా ఉండమని, అన్నిటికి తాను ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి.. ఒక్క రమేశ్ బాబు కుటుంబానికే కాదు, తన తోబుట్టువులకు పుట్టింటి అండ, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మహేశ్ దే. తన చుట్టూ ఇంతటి క్లిష్టతరమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నా.., ఇంటి పెద్దగా కొండంత దైర్యంతో మహేశ్ ముందుకి సాగుతుండటం నిజంగా మంచి విషయమే.