మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు వారికి సుపరిచితుడే. ఆయన నటించిన ‘జన గణ మన’ చిత్రం ఓటీటీలో తెలుగులో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఆయన తీసిన ‘లూసిఫర్’ సినిమాను ఇటీవలే చిరంజీవి హీరోగా ‘గాడ్‌ఫాదర్’గా రీమేక్ చేశారు. అలాంటి పృథ్వీరాజ్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నాడు.
కన్నడ నాట చిన్న చిత్రంగా విడుదలైన ‘కాంతార’ సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు, హిందీ, తమిళంలోనూ మంచి విక్టరీ కొట్టింది. ముఖ్యంగా తెలుగులో రూ.60 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో రిషబ్ శెట్టి తనదైన నటనతో అందర్నీ కట్టిపడేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భూతకోల సీక్వెన్స్ సమయంలో సూపర్బ్ యాక్టింగ్‌తో చూపు తిప్పుకోకుండా చేశాడు. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా ఆయన కరబర్చిన పనితనం అందరి మెప్పూ పొందింది.
ప్రశంసలతో పాటు కలెక్షన్ల పరంగానూ ‘కాంతార’ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను ఓ వివాదం మాత్రం వదలడం లేదు. ‘కాంతార’ సినిమాలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వరాహ రూపం’ పాటపై అప్పట్లో కాపీరైట్ ఆరోపణలు వెలువడిన సంగతి విదితమే. దీనిని తమ బ్యాండ్‌కు చెందిన ‘నవరస’ పాట నుంచి కాపీ కొట్టారని చెబుతూ కేరళకు చెందిన ‘తైకుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఇప్పటికే ‘కాంతార’ మేకర్స్‌పై కాపీరైట్ కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు ఇదే కేసులో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.
పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. దీనికి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రిషబ్ శెట్టి తీసిన ‘కాంతార’ను కేరళ వ్యాప్తంగా ఈ సంస్థే విడుదల చేసింది. కాగా, ‘నవరస’ సాంగ్‌ను.. ‘మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కో. లిమిటెడ్’ యాజమాన్యంలోని ‘కప్పా’ టీవీలో తొలిసారిగా ప్రదర్శించారు. ఈ పాటను అనధికారికంగా కాపీ చేశారనే ఆరోపణల మీద పంపిణీ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న పృథ్వీరాజ్‌పై మాతృభూమి కంపెనీ కంప్లయింట్ చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
‘కాంతార’ మూవీకి తాను కేవలం డిస్ట్రిబ్యూటర్నే తప్ప సినిమా మేకింగ్‌లో లేదా మ్యూజిక్ కంపోజిషన్‌లో పాలుపంచుకునే ప్రొడ్యూసర్‌ను కాదని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. దీంతో కేరళలోని కోజికోడ్ కోర్టు పృథ్వీరాజ్ మీద వేసిన పిటిషన్‌పై స్టే విధించింది. పృథ్వీరాజ్ సుకుమార్‌పై నమోదైన ఎఫ్ఐఆర్పై జస్టిస్ బెచూ కురియన్ థామస్ సింగిల్ బెంచ్ స్టే విధిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేరళలో సినిమా పంపిణీదారుడిగా ఉన్న నటుడ్ని అనవసరంగా ఇందులోకి లాగుతున్నారని కోర్టు తెలిపింది. ‘కాంతార’ డిస్ట్రిబ్యూషన్‌ను ఆయన సులభతరం చేశారే తప్ప.. ఆ చిత్ర నిర్మాణం, సంగీత రూపకల్పనలో ఆయన పాలుపంచుకోలేదని కోర్టు పేర్కొంది.