సినీ ఇండస్ట్రీలో విషాదాలకు బ్రేక్ పడడం లేదు. గత కొన్ని నెలల నుంచి దిగ్గజ నటులను, ప్రముఖులను కోల్పోతూ వస్తుంది. ఇప్పటికే ఈ నెలలో కె విశ్వనాథ్, తారకరత్నల మరణాలను మరువక ముందే మరో విషాదం నెలకొంది.
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 2వ తేదీన కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. ఆ విషాదం నుండి కోలుకోకముందే తారకరత్న అకాల మరణం అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. ఈ బాధ నుంచి తేరుకోకముందే దివంగత కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన ఆమె భర్త విశ్వనాథ్ చనిపోగా.. ఇవాళ ఆయన సతీమణి కన్ను మూశారు.
భర్త కన్నుమూసిన 24 రోజుల వ్యవధిలోనే ఈమె కూడా తిరిగిరాని లోకాలకు పయనం అవ్వడం అందరినీ కలిచివేస్తోంది. విశ్వనాథ్ చనిపోయిన సమయంలో ఆమె అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీరి పెద్ద కుమారుడికి కబురు అందించారు కుటుంబ సభ్యులు. ఆయన వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చావులోనూ తమను ఎవరూ విడదీయలేరని ఒకే నెలలో దంపతులిద్దరూ పరమపదించారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆమెకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుందాం. ఓం శాంతి.
#KVishwanath #Jayalakshmi #Oneindiatelugu pic.twitter.com/S5OEccSnyR
— oneindiatelugu (@oneindiatelugu) February 26, 2023