విశ్వక్ సేన్ ఒక పక్క హీరోగా చేస్తూనే.. తనే దర్శకుడిగా మారి తన సినిమాలను తనే నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో తానే దర్శకత్వం వహించి నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే విశ్వక్ సేన్ ని దర్శకత్వం మానేయాలని రిక్వస్ట్ చేశారు. ఎందుకంటే?
విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. విశ్వక్ సేన్ కోరిక మేరకు ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈరోజు ప్రపంచపటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డును చేజిక్కించుకుందంటే దానికి కారణం రాజమౌళి, కీరవాణి, పాటలు పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ లతో పాటు తెలుగు చలన చిత్ర సీమ, భారతదేశ చిత్ర పరిశ్రమ, యావత్ భారతదేశపు ప్రేక్షకులు కూడా కారణమని అన్నారు. ఆ అవార్డుని సాధించింది ప్రేక్షకులే అని.. ప్రేక్షకుల బదులు తాము అవార్డు అందుకున్నామని అన్నారు. అవార్డు తీసుకున్నప్పుడు కీరవాణి, చంద్రబోస్ కనబడలేదని.. ఇద్దరు భారతీయులు, ఇద్దరు తెలుగు వ్యక్తులు కనబడ్డారని అన్నారు.
ఇక దాస్ కా ధమ్కీ సినిమా గురించి, విశ్వక్ సేన్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. విశ్వక్ సేన్ లా మాట్లాడినట్లు తాను మైక్ లో మాట్లాడలేనని.. విశ్వక్ కాన్ఫిడెన్స్ ఇంపాజిబుల్ అని అన్నారు. తానే బాగా వాగుతానని.. అలాంటిది తనకంటే ఎక్కువ మాట్లాడతాడని, తానే సైలెంట్ అయిపోయి విశ్వక్ సేన్ మాటలు వినే స్టేజ్ కి తీసుకెళ్లిపోయారని అన్నారు. మూడ్ ఆఫ్ అయినప్పుడు, టెన్షన్ లోకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ సినిమాలు చూస్తానని.. అలా చూసిన వాటిలో ఈ నగరానికి ఏమైంది సినిమా చూశానని అన్నారు. ఆ సినిమాలో విశ్వక్ ని చూస్తూ ఉండిపోవచ్చునని అన్నారు. ఫలక్ నుమా దాస్ సినిమా చూశానని.. ఎంత కాన్ఫిడెంట్ గా నటించారో.. అంతే కాన్ఫిడెంట్ గా డైరెక్షన్ చేశాడని అన్నారు.
తనకు బాగా నచ్చినటువంటి సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా అని అన్నారు. ఇంత యాటిట్యూడ్ కలిగిన విశ్వక్ సేన్.. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో యాటిట్యూడ్ పక్కన పెట్టి అమాయకమైన పాత్రలో నటించడం చాలా గొప్ప విషయమని అన్నారు. హిట్ సినిమా చూసి చాలా షాకయ్యానని అన్నారు. చాలా బ్యాలెన్స్డ్ గా నటించాడని.. అంత బ్యాలెన్స్డ్ గా నటించడం చాలా కష్టమని అన్నారు. తనకు తానుగా నిరూపించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చిన హీరో అని అన్నారు. దాస్ కా ధమ్కీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని.. అయితే విశ్వక్ సినిమాలు దర్శకత్వం చేయడం ఆపేయాలని సంచలన కామెంట్స్ చేశారు.
దయచేసి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి డైరెక్షన్ ఆపేయ్ అని, ఎందుకంటే చాలా మంది యువ దర్శకులు ఉన్నారని, వారికి నటులే అవకాశాలు ఇవ్వాలని అన్నారు. కొత్త దర్శకులకు విశ్వక్ లాంటి వాళ్ళే అవకాశాలు ఇవ్వాలని, తాము కూడా ఆ కొత్త దర్శకులతో సినిమాలు చేయగలగాలని, కాబట్టి సినిమాలు దర్శకత్వం మానేసి నటుడిగానే కొనసాగు అంటూ విశ్వక్ ని తారక్ కోరారు. తెలుగు సినిమా టాప్ లో ఉంది. అది పడిపోకూడదు. మనందరం కలిసి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి.. తెలుగు సినిమాని ప్రపంచ పటం నుంచి పడిపోకుండా నిలబెట్టాలి అని అన్నారు. మరి ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.