ఇప్పటి జనరేషన్ కు హీరో రాజశేఖర్ భార్యగా తెలిసిన జీవిత.. అప్పట్లో ప్రముఖ హీరోయిన్. పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ వదిలేసి దాదాపు 33 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయిపోయింది.
సాధారణంగా చాలామంది హీరోయిన్లు గ్లామర్ మెంటైన్ చేసినన్ని రోజులు వరసగా సినిమాలు చేస్తారు. తమకు అవకాశాలు తగ్గిపోతున్నాయి అనే టైంలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిలై పోతారు. కొందరు మాత్రం కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెడతారు. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైపోతారు. అది పర్మినెంట్ లేదా కొన్నేళ్ల పాటు అనేది వాళ్ల ఇష్టం బట్టి ఉంటుంది. కెరీర్ పీక్ లో పెళ్లి చేసుకున్న జీవితా రాజశేఖర్ మాత్రం.. అప్పుడు వదిలేసిన నటనని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ రీస్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 1984లో హీరోయిన్ గా మారిన జీవిత తొలి మూవీ తమిళంలో చేశారు. దాదాపు రెండేళ్లపాటు అక్కడ వరసగా చిత్రాలు చేశారు. తెలుగులోనూ తలంబ్రాలు, జానకి రాముడు, అహుతి, అంకుశం, మగాడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. 1990లో చివరగా ‘మగాడు’లో యాక్ట్ చేసిన జీవిత.. అందులో హీరోగా నటించిన రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యారు. చాలా ఆఫర్స్ వచ్చినా సరే ఆమె రిజెక్ట్ చేసేశారు. ప్రస్తుతం డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు తీస్తున్నారు. తన భర్త రాజశేఖర్ హీరోగా శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ సినిమాలని జీవితనే డైరెక్ట్ చేశారు.
జీవితా రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు శివాత్మిక, శివానీ ప్రస్తుతం హీరోయిన్లుగా చేస్తున్నారు. ఫ్యామిలీ బాధ్యతల్ని చూసుకుంటూ, మరోవైపు రాజకీయాల్లోనూ కాస్త యాక్టివ్ గా ఉన్న జీవిత.. యాక్టర్ గా రీఎంట్రీ ఇస్తారని ఎవరు అనుకుని ఉండరు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో చెల్లెలు పాత్ర కోసం ఆమెని సంప్రదించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రజనీకాంత్ తీస్తున్న ‘లాల్ సలామ్’ మూవీతో జీవిత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. దీన్నిబట్టి చూస్తే దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె మేకప్ వేసుకోనున్నట్లే. మార్చి 7 నుంచి చెన్నైలో షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి జీవితా రాజశేఖర్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, అది కూడా రజనీకాంత్ సినిమాతో రీఎంట్రీపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.