ఇంటింటి గృహలక్ష్మి.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సీరియల్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా మొత్తం కుటుంబాన్ని లీడ్ చేసే పాత్రలో కస్తూరి ఎంతో చక్కగా నటిస్తోంది. ఆమెకు ఎదురయ్యే కష్టాలను ఎంతో సమర్థంగా ఎదుర్కొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లోకి సీరియల్ స్టార్ హీరో ఇంద్రనీల్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇంద్రనీల్.. మొగలి రేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ తో యూత్ మొత్తాన్ని సీరియల్స్ వైపు మళ్లించాడు. ఆ తర్వాత పలు కారణాల రీత్యా.. ఇంద్రనీల్ చానాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో ఇంద్రనీల్ మళ్లీ బుల్లితెరలో అడుగుపెట్టాడు. సామ్రాట్ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో ఇంద్రనీల్ ని పరిచయం చేశారు.
తొలుత తులసి గురించి తప్పుగా అనుకున్న సామ్రాట్.. తర్వాత తులసి గురించి నిజం తెలుసుకుని హానీకి డాన్స్ నేర్పేందుకు ఒప్పిస్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, రాను రాను తులసికి జోడీ అన్నట్లు సామ్రాట్ ని చూపిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ప్రేక్షకులు సీరియల్ కాన్సెప్ట్ ని తప్పుబడుతున్నారు.
ఎందుకంటే ఇద్దరు కొడుకులు, కోడళ్లు, పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉన్న తులసిని హనీలాంటి చిన్న పాప తండ్రిగా ఉన్న సామ్రాట్ జోడీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అమ్మమ్మ కాబోతున్న తులసిని సామ్రాట్ జోడీగా ఎలా చూపిస్తారంటూ అడుగుతున్నారు. సామ్రాట్ కి తెల్లజుట్టు పెట్టి ఏజెడ్ అని అయినా చూపించాలంటూ సూచిస్తున్నారు. మొత్తానికి చిన్న లాజిక్ మిస్ అయ్యారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.