విశ్వక్ సేన్.. తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. తన నటన, హావభావాలతోనే కాకుండా సినిమాపై తనదైనశైలిలో స్పందిస్తూ విశ్వక్ వార్తల్లో నిలుస్తుంటాడు. రేపు పాగల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్ రెండ్రోజులుగా తన కామెంట్లతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముందుగా సినిమా విషయానికి వస్తే లక్కీ మీడియా బ్యానర్లో రాబోతున్న చిత్రం పాగల్. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. పాగల్ సినిమాకి కథ, దర్శకత్వం వహిస్తున్న నరేష్ కుప్పిలికి ఇదే తొలిచిత్రం. విశ్వక్ సేన్, నివేదా పేతురాజు, హీరో, హీరోయిన్లుగా, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో.. కామెడీగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ పాగల్.
ప్రేమ గురించి చెప్పే ఒక గొప్ప కథ, అమ్మను పిచ్చిగా ప్రేమించే కొడుకు కథని బాగా గట్టిగానే చెప్తున్నారు. అమ్మ ప్రేమ తిరిగి దొరుకుతుందా, లేదా అనే అంశాలతో ముడిపడిన ఈ కథకు ‘పాగల్’ టైటిల్ సరిగ్గా సరిపోతుంద విశ్వక్ అంటున్నాడు. మొదటి ఐదు నిమిషాల్లోనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. తల్లీకొడుకుల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించినట్లు విశ్వక్ తెలిపారు. ‘నిజాయతీగా మనం ఎవర్ని ప్రేమించినా వాళ్లు తిరిగి ప్రేమిస్తారు’ అని సినిమాలోని అమ్మపాత్ర చెబుతుంది. చనిపోయిన ఆ తల్లి ప్రేమను మరొకరిలో వెతికే ప్రయత్నమే కథాంశం. సినిమా చూశాక, ఇంటికెళ్లి ఈ పాత్రల గురించి మాట్లాడకుండా వుండలేరని భరోసా వ్యక్తం చేస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కథకి కనెక్ట్ అయి పాగల్ తీశాం.. చూసిన ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం కదిలిస్తుందనే నమ్మకంతో ఉన్నామంటున్నాడు విశ్వక్ సేన్. నాకంటూ ఎవరి సపోర్ట్ లేదంటున్న విశ్వక్ ఈ సినిమా ప్రచారం కోసం బాగానే కష్టపడుతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ‘ఎవరైనా శుక్రవారం రిలీజ్ చేస్తారు. నేను పాగల్ కదా అందుకే శనివారం రిలీజ్. సర్కస్లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవిలో సింహంతో ఆడుకుంటా. అమ్మతోడు ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు తెరుచుకుంటాయి’. అని విశ్వక్ చేసిన కామెంట్లను కొందరు సరదాగా తీసుకున్నా.. కొందరి మనోభావాలు మాత్రం బాగానే దెబ్బతిన్నాయి.
తాను సినిమా తొలి కాపీ చూసి, ఆ మాటలు అన్నానని, అప్పుడు మాట్లాడిన ఏ మాటనీ వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదని కుండ బద్దలు కొట్టేసాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ సినిమా చూశాకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. సినిమాకి ఎక్కువ, సినిమాకి తక్కువ కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని స్పష్టం చేసాడు. మిత్రులు, దర్శకుడి స్నేహితులూ సినిమా చూసి ‘అన్నా.. నువ్వు పేరు మార్చుకునే పనిలేదు’ అని అన్నట్లు విశ్వక్ తెలిపాడు.
పనిలోపని రాబోయో ప్రోజెక్టులపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేసాడు. ప్రస్తుతం పీవీపీ, దిల్రాజు కాంబినేషన్లో చేస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 70 శాతం పూర్తయినట్లు వెల్లడించాడు. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ అనే మరో సినిమాలో నటిస్తున్నట్లు విశ్వక్ తెలిపాడు.