దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు.. కుర్రకారును తన మాయలో పడేసింది హన్సిక. ఆ తర్వత ఎంతో మంది పెద్ద హీరోలతో సినిమాలు చేసి.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత హన్సికకు టాలీవుడ్ గుర్తింపు, అవకాశాలు తగ్గిపోయాయి. అయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. 2019 తర్వాత మళ్లీ ఈ ఏడాది వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 7 సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి ఇంతి బిజీ షెడ్యూల్‌లో హన్సిక తన ఫ్యాన్స్‌కి ఓ శుభవార్త చెప్పింది. ఆమె త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వివాహం కోసం జైపూర్‌లోని ఓ కోటని కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపారు.
అయితే అప్పుడు పెళ్లికొడుకు ఎవరు ఏంటి అనే విషయాలను హన్సిక వెల్లడించలేదు. తాజాగా తాను చేసుకోబోయేవాడిని హన్సిక అభిమానులకు పరిచయం చేసింది. అతనితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే అతను ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. అతను మరెవరో కాదు.. హన్సిక చిన్ననాటి స్నేహితుడు, ఆమె బిజినెస్ పార్టనర్ సోహైల్. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద సోహైల్ హన్సికకు ప్రపోజ్ చేస్తున్న ఫొటోలు, ఆమె అతడికి అంగీకారం తెలిపిన ఫొటోలను షేర్ చేసింది. ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం హన్సికకు శుభాకాంక్షలు చెబుతున్నారు.