ఒక చేత్తో చేసే సాయం మరొక చేతికి తెలియకూడదని కొంతమంది నమ్ముతుంటారు. చేసిన దానాలు, చేసిన సహాయాలు బయటకి చెప్పుకోరు. ఎప్పుడో.. ఎవరో సాయం పొందిన వారు చెప్తే తప్ప.. చిరంజీవి లాంటి వ్యక్తుల గురించి బయటకు తెలియదు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కష్టం ఉందని వెళ్తే.. వెంటనే సహాయం చేస్తారు. అయితే ఆర్థిక సహాయం, లేదంటే మాట సహాయం చేస్తారు. తన మాట వల్ల ఒక మనిషికి ప్రయోజనం చేకూరుతుందంటే.. వెంటనే సంబంధిత వ్యక్తులతో మాట్లాడి ఆ పని అయ్యేలా చూస్తారు. మా ఊరికి గుడి మంజూరు చేయండి అని ఒక మహా నటుడి కూతురు చిరంజీవి దగ్గరకు వెళ్తే.. ఆయన చలించిపోయి అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ ముందుకు కదిలేలా చేశారు. అప్పటి వరకూ ఆ ఫైల్ ని పట్టించుకున్న నాధుడు లేరు. చిరంజీవే ఆపద్బాంధవుడిలా వచ్చారు.
గుమ్మడి వెంకటేశ్వర రావు గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోలకు తండ్రిగా, మావయ్యగా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన అలనాటి మేటి నటుడు గుమ్మడి. ఇంటి పేరునే తెర పేరుగా మార్చుకున్న అరుదైన నటుడు గుమ్మడి. చాలా సున్నిత మనస్కులు. ఎవరినీ ఒక్క మాట కూడా అనని వ్యక్తిత్వం ఆయనది. అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన ఆమె శారద. ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె చిరంజీవి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో తన ఊళ్ళో తన ముత్తాతల్లో ఒకరు రామాలయం కట్టించారని, కాలక్రమేణా ఆ గుడి రోడ్డు కన్నా కిందకు వెళ్ళిపోయి.. గుడిలో నీళ్లు చేరి చాలా ఇబ్బందిగా ఉండేదని అన్నారు.
ఒకరోజు తాను ఊరు వెళ్ళినప్పుడు.. ఆ గుడి పురోహితుడు చాలా ఇబ్బందిగా ఉందని చెబితే.. ఏదో ఒకటి చేయాలని అనుకున్నానని ఆమె అన్నారు. చిరంజీవిని కలిస్తే పనవుతుందని తెలిసి.. ఆయనను కలవడం జరిగిందని చెప్పారు. ఆ గుడి పైకి తీయాలని మా అమ్మ గారి ఆఖరి కోరిక అని, అది తీరకుండానే అమ్మ వెళ్లిపోయారని చిరంజీవికి చెప్పారు. అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలిందని, గుడిని మళ్ళీ కట్టించేలా చిరంజీవి పూనుకున్నారని.. కొత్తగా గుడి కట్టి ఆరేళ్ళు అవుతుందని గుమ్మడి కూతురు శారద అన్నారు. ఆరేళ్ళ క్రితం అంటే.. అప్పటికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
2014 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. అప్పటికి టూరిజం మినిస్టర్ గా కూడా లేరు. అయినా గానీ పలుకుబడితో గుడి నిర్మాణ పనులకు కావాల్సిన అనుమతులు తీసుకొచ్చి.. ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు తన వంతు సహాయం చేశారు. రాముల వారి ఆలయం కోసం.. హనుమంతుని పేరు పెట్టుకున్న చిరంజీవి పూనుకోవాల్సి వచ్చింది. అయితే ఆలయ ప్రారంభానికి చిరంజీవిని పిలిచామని.. అయితే అప్పుడు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని ఆమె అన్నారు. ఈ విషయంలో చిరంజీవి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటానని అన్నారు. మరి ఎవరూ చేయలేకపోయిన పనిని చేసిన, శారద తల్లి ఆఖరి కోరిక నెరవేర్చిన చిరంజీవిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.