ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఏడాది తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన బాలమురుగన్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే బాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలు అందించిన గేయ రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. ఆదివారం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాసిర్ ఫరాజ్ వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన గుండె బబ్బుతో బాధపడుతున్నారు. ఏడు సంవత్సరాల క్రితం ఆయన హార్ట్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనకు మరోసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
2010లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘కైట్స్’మూవీకి సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఆయన రాసే పాటలు అభిమానుల మనసుకు హత్తుకునేలా ఉంటాయని అంటారు. నాసిర్ ఫరాజ్ అకాల మరణం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.