దిల్ రాజు నిర్మించిన బలగం సినిమాతో జబర్దస్త్ కమేడియన్ వేణు డైరెక్టర్ గా మారిపోయాడు. తెలంగాణ సంస్కృతి ఆధారంగా వేణు ఈ కథను తెరకెక్కించాడు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా తన కథ ఆధారంగా తెరకెక్కించారంటూ ఓ జర్నలిస్ట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ విమర్శలపై డైెరెక్టర్ వేణు స్పందించాడు.
జబర్దస్త్ కమేడియన్ వేణు.. బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో ఉన్న ఒక సంప్రదాయం, ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఒక ఎమోషనల్ జర్నీని వేణు అద్భుంతగా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై జర్నలిస్ట్ గడ్డం సతీశ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణలపై డైరెక్టర్ వేణు స్పందించాడు. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి జర్నలిస్ట్ చేసిన ఆరోపణలను వేణు ఖండించాడు. తాను ఎవరి కథలను కాపీ కొట్టలేదని.. అసలు ఆ కథని అతను చదవలేదని వ్యాఖ్యానించాడు.
“జర్నలిస్ట్ గడ్డం సతీశ్ మా కథను అబాసు పాలు చేస్తున్నాడు. మా కథ ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఆయన రాసిన కథ కూడా ఉంది. రెండిని ఒకసారి గమనిస్తే విషయం ఏంటో అర్థమవుతుంది. తన మూల కథను కాపీ కొట్టాం అంటున్నాడు. మూల కథ అనేది అసలు ఎక్కడా లేకుండా వాళ్లే ప్రత్యేకంగా రాస్తే అవుతుంది. కాకిని ఆయనేమీ తయారు చేయలేదు కదా? పిట్ట ముట్టుడు అనేది తెలుగు సంస్కృతి. మా నాన్న చనిపోయిన సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ తర్వాత దీనిని కథగా మలిచాను. దీనిపై నేను ఆరేళ్లపాటు రీసెర్చ్ చేశాను. మొదట ఈ కథను డైరెక్టర్ అనుదీప్ కి వినిపించాను” అంటూ వేణు చెప్పుకొచ్చాడు.
“అసలు నేను సతీశ్ రాసిన కథను చదవను కూడా లేదు. కథ ఆయనదే అయితే రచయితల సంఘాన్ని కలవాల్సిందిగా? పిట్ట ముట్టుడు సంప్రదాయం అనేది ఎవరి సొత్తు కాదు. తెలుగు సంస్కృతులను ఒక్కొక్కరు ఒకలా చూపిస్తారు. ఇదే సంస్కృతిపై ఎవరైనా సినిమాలు చేయచ్చు. ఈ కాకి మీద ఇంకా వంద సినిమాలు చేసినా నాకు హక్కు లేదు. సంస్కృతిపై ఎవరికీ హక్కు ఉండదు. చట్టబద్దంగా వెళ్తాను అంటున్నారు. అలాగే వెళ్లండి మీకు- నాకు ఒకే చట్టం అలాగే వెళ్దాం. మా సినిమాని ఇలా అబాసుపాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది కేవలం బ్లాక్ మెయిల్ మాత్రమే. దిల్ రాజు ముందుకొచ్చి ఈ బలగం సినిమా చేయకపోతే ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిలోని ఈ లైన్ ఎలా తెలిసేది” అంటూ వేణు వ్యాఖ్యానించాడు.