తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు సుకుమార్. మ్యాథ్స్ లెక్చరర్ గా కెరీర్ ఆరంభించిన ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ తర్వాత సుకుమార్ తీసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ చిత్రాలే. గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో ఒక్క ఊపు ఊపింది. కలెక్షన్లు కూడా భారీగా వసూళ్లు చేశాయి. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ బిజీలో ఉన్నాడు సుకుమార్. తాజాగా సుకుమార్ తన మంచి మనసు చాటుకొని వార్తల్లో నిలిచాడు.
ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆనంద్ అనే యువకుడు క్యాన్సర్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా అది చూసిన డైరెక్టర్ సుకుమార్ వెంటనే చలించిపోయాడు. ఆనంద్ చికిత్స కోసం రూ.50 వేలు అందించి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సుకుమార్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఏదైనా ప్రకృతి విపత్తులు వస్తే తన వంతుగా భారీ విరాళాలు ఇస్తుంటారు.
ఇటీవల సుకుమార్ తన స్వగ్రామం అయిన మట్టపర్రు లో పాఠశాలను ఏర్పాటు చేసి తన వంతు సహాయాన్ని అందించారు. అంతేకాదు చుట్టు పక్కల గ్రామాల్లో విద్యార్థులకు స్కాలర్ షిప్, క్రీడా రంగాల్లో గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. సుకుమార్ గతంలో తన అభిమానులు ఆపదలో ఉన్నసమయంలో ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సుకుమార్ కరోనా సమయంలో పేద ప్రజలకు ఆహారాన్ని అందించి ఆపద్భాందువుడిగా నిలిచారు.