సంక్రాంతికి బాక్సాఫీస్ రెడీ అయిపోయింది. తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలుగా వారసుడు, తెగింపు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 11న వారిసు, తెగింపు రిలీజ్ అవుతుండగా.. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ కాబోతున్నాయి. కానీ.. నిన్నటివరకు వారిసు తెలుగు వెర్షన్ వారసుడు రిలీజ్ డేట్ పై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయంపై తాజాగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తమిళంలో జనవరి 11న రిలీజ్ అవుతుందని… తెలుగు విషయానికి వచ్చేసరికి రిలీజ్ డేట్ ని జనవరి 14కి మార్చినట్లు తెలిపారు. దళపతి విజయ్, రష్మిక మందాన నటించిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు.
తాజాగా ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఈ మధ్య వారసుడు రిలీజ్ విషయంలో మేము ఏం మాట్లాడుకున్నా.. వెంటనే బయటికి లీక్ అయిపోతున్నాయి. నాలుగు రోజులుగా వారసుడు గురించి ఇండస్ట్రీలో హల్చల్ నడుస్తోంది. సంక్రాంతి వారసుడిగా సినిమా రిలీజ్ చేస్తున్నాం. తమిళంలో జనవరి 11న రిలీజ్ అవుతుంది. కానీ.. తెలుగులో ఆల్రెడీ పెద్ద హీరోల సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉండటంతో.. రెండు రోజులు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ విషయంపై ఆల్రెడీ ఇండస్ట్రీలో పెద్దలతో డిస్కస్ చేశాం. దీంట్లో ఒక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదు. వారసుడుపై నాకు 100 శాతం నమ్మకం ఉంది.
సూపర్ హిట్ కొట్టబోతున్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసినా ప్రాబ్లెమ్ లేదు. మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి థియేటర్స్ ఇష్యూ అని.. దిల్ రాజుని ఎప్పుడు టార్గెట్ చేస్తూ రకరకాలుగా జరుగుతున్నాయి. నేను కూడా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాను. నా సినిమా బాలయ్య, చిరంజీవిలకు పోటీకాదు. ఇది పక్కా.. దిల్ రాజు నుండి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, శతమానం భవతిలాగే అలరిస్తుంది. కాబట్టి.. నేను ఒక పాజిటివ్ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు ఎప్పుడూ అందరూ నామీద పడి ఏడుస్తుంటారు. పర్లేదు పాజిటివ్ గానే అన్ని తీసుకుంటాను. ఈ సినిమాలో ఏముంది అంటే.. ఫ్యామిలీ మూవీ అయినా.. కొత్త పాయింట్ ఉంటుంది. అందరినీ అలరిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.