తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గుబాటి కుటుంబం చేసిన సేవలు అపురూపమనే చెప్పాలి. నిర్మాతగా 150 పైచిలుకు చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నారు దగ్గుబాటి రామానాయుడు. తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఎన్నో సినిమాలు తీశారాయన. నిర్మాతగా ఇతర హీరోలతో సినిమాలు తీస్తూనే.. తన కుమారుడు వెంకటేష్‌ను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తర్వాత వెంకటేష్ ఏ స్థాయికి ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరిగా, తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను వెంకీ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే.
రామానాయుడి పెద్ద కుమారుడు సురేష్ బాబు గురించి కూడా పరిచయం అక్కర్లేదు. తండ్రిలాగే నిర్మాణతగా మారి ఎన్నో సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్‌ను ఆయన తీశారు. ఇక సురేష్ బాబు తనయుడు రానా హీరో అనే విషయం తెలిసిందే. ‘బాహుబలి’, ‘ఘాజీ’ సినిమాలతో ఆయన దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో వస్తున్నాడు. రానా సోదరుడు అభిరామ్ చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ‘అహింస’ అనే చిత్రంలో అభిరామ్ నటిస్తున్నాడు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.
తాజాగా రిలీజైన ‘అహింస’ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేమకథల స్పెషలిస్టుగా చెప్పుకునే తేజ.. ‘అహింస’ను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పల్లెటూరులో ఇద్దరు యువతీయువకుల ప్రేమ, ఆ ప్రేమకథ చుట్టూ చట్టం, న్యాయం, నక్సలిజం నిలబడితే ఎలా ఉంటుందనే పాయింట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘నన్ను నమ్ముకున్నవాళ్లను కాపాడటమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే’ అంటూ దగ్గుబాటి అభిరామ్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా అనిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న గీతికకూ ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. చాన్నాళ్ల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు. రజత్ బేడీ, సదా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘అహింస’తో అభిరామ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.