బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రౌనత్. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే ఈ అమ్మడు ఇటీవల నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ కుంభకోణంపై పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సహనటులపై కూడా నిర్మొహమాటంగా మాటల తూటాలు పేలుస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది.
తాజాగా కంగనా రౌనత్ కి ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. బాలీవుడ్ మాటల రచయిత జావేద్ అఖ్తర్ తనపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాల్సిందిగా కంగనా రౌత్ వేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. కోర్టు జడ్జి జస్టిస్ రేవతి మోహితే దేరే ఈ కేసులో విచారణ చేపట్టారు. సెప్టెంబర్ ఒకటిన తన ఆదేశాలను రిజర్వ్‌లో ఉంచారు. అయితే ఆ కేసులో కంగనా పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఇవాళ జస్టిస్ రేవతి తెలిపారు. కాగా, అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కంగనాపై పరువు నష్టం కేసు విచారణ మొదలుపెట్టింది. ఆ కేసును కంగనా సవాల్ చేసింది. ఆమె తరపు రిజ్వాన్ సిద్ధికీ వాదించారు. కానీ, ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందేనంటూ బాంబే హైకోర్టు విచారణకు ఆదేశించింది.
అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జావెద్ అక్తర్‌పై నటి కంగనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో జావెద్ అక్తర్ సీరియస్ కావడమే కాదు.. అనవసరంగా తన ప్రతిష్ఠకు.. గౌరవానికి భంగం కలిగించిందని.. కంగనాపై క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన జూహూ పోలీసులు ఫిబ్రవరిలో ఆమెకు సమన్లు జారీ చేశారు.