పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై బాలీవుడ్ స్టార్ రైటర్, ప్రముఖ కవి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై ఆ దేశంలోనే ఆయన విమర్శలు చేయడం గమనార్హం.
ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ గురించి వినే ఉంటారు. మూడు దశాబ్దాలుగా అద్భుతమైన పాటలు రాస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఆయన ఉర్రూతలూగిస్తున్నారు. సినీ గీతాలతో పాటు కవితా రచనతోనూ సాహిత్య ప్రపంచంలో ఆయన తనదైన ముద్ర వేయగలిగారు. అలాంటి జావెద్ అక్తర్ తాజాగా పాకిస్థాన్‌పై ఆ దేశంలోనే విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 26/11 ముంబై ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన.. ఆ అటాక్‌కు పాల్పడిన టెర్రరిస్టులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ స్మారకార్థం రీసెంట్గా పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఫైజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫైజ్ ఫెస్టివల్‌కు రావాల్సిందిగా ఆహ్వానం అందడంతో జావెద్ అక్తర్ పాక్‌లో పర్యటించారు. ఈ ఫెస్టివల్లో ఆయన.. అక్కడి జర్నలిస్టులతో ఇండియా – పాకిస్థాన్ సంబంధాలు, ముంబై టెర్రర్ అటాక్ ఘటనను ప్రస్తావించారు. ‘ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన ఏ సమస్యా పరిష్కారం కాదు. పైగా వీటి వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. కాబట్టి వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. మేం ముంబైకి చెందిన వాళ్లం. మా సిటీలో టెర్రరిస్టులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో మా కళ్లారా చూశాం.
‘ఆ ఉగ్రవాదులు నార్వే లేదా ఈజిప్టు నుంచి రాలేదు. వాళ్లు ఇంకా మీ దేశంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు భారత్ కంప్లయింట్ చేసినప్పుడు మీరు దాన్ని నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని జావెద్ అక్తర్ చెప్పుకొచ్చారు. భారత కళాకారులను పాకిస్థాన్ గౌరవించకపోవడాన్ని జావెద్ తప్పుబట్టారు. ‘నుస్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ వంటి పాక్ ఆర్టిస్టుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ లతా మంగేష్కర్ కోసం పాకిస్థాన్ ఎప్పుడైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసిందా?’ అని జావెద్ అక్తర్ క్వశ్చన్ చేశారు.
జావెద్ అక్తర్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, 2008 నవంబర్ 26న పాక్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్టు గ్రూప్‌నకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో 166 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. అతడ్ని నాలుగేళ్ల తర్వాత 2012లో ఉరితీశారు.
‘हम तो बंबई के लोग हैं, हमने देखा कैसे हमला हुआ था…वो लोग नॉर्वे से तो नहीं आए थे, न मिस्र से आए थे, वो लोग अभी भी आपके मुल्क में घूम रहे हैं’. – लाहौर के फ़ैज़ फेस्टिवल में जावेद अख्तर#FaizFestival2023#javedakhtar pic.twitter.com/s9s1cMYZqf
— Versha Singh (@Vershasingh26) February 21, 2023