వేరీ ఈజ్ ద పార్టీ అంటూ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో చిందులేసింది. ఆ తరువాత వైల్డ్ సాలా అంటూ అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ రేంజ్లో కుమ్మేసింది. త్వరలో బోయపాటి దర్శకత్వంలో నర్తించబోతోంది బాలీవుడ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఊర్వశి రౌతేలా. ఖరీదైన వస్తువులు ధరించి వార్తల్లో నిలిచే ఈమె..
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తెలుగు వారికి పరిచయమే. ఈ ఏడాది ఆమె వేరీ ఈజ్ ద పార్టీ అంటూ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో చిందులేసింది. ఆ తరువాత వైల్డ్ సాలా అంటూ అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ రేంజ్లో కుమ్మేసింది. త్వరలో బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో నటిస్తున్న రాపో చిత్రంలో ఓ పాటలో ఆడిపాడనుంది. 2013లో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ గ్లామర్ క్వీన్.. స్పెషల్ సాంగ్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది ఈ అమ్మడు. అయితే ప్యాషన్, లగ్జరీగా బతకడం ఆమెకు మొదటి నుండి అలవాటు.
మెడలో ఖరీదైన వస్తువులు, నగలు, దుస్తులు ధరించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన కేన్స్ ఉత్సవాల్లో మొసలి లాంటి ఆభరణాన్ని అలంకరించుకున్న సంగతి విదితమే. రామ చిలుకలా డిజైన్ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ పై వయ్యారంగా నడిచింది. రకరకాల దుస్తులతో తళుక్కున మెరిసింది. అయితే తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. ఈ అమ్మడు ఓ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందట. అదీ కూడా ఓ బడా నిర్మాత ఇంటి పక్కనే. ఇంతకు ఆ నిర్మాత ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు దివంగత నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కన. ముంబయిలో సంపన్నులు ఉండే జూహు ప్రాంతంలో ఉందట ఆ ఇంద్రభవనం. విలాసవంతమైన నాలుగు అంతస్థుల భవంతి విలువ అక్షరాలా రూ. 190 కోట్లు ఉంటుందని వినికిడి.
విశాలవంతమైన బంగ్లాకు ఇటీవల ఆమె షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నో హంగులతో కట్టిన ఇంటిలో ఎన్నో సౌకర్యాలున్నాయని తెలుస్తోంది. ఇందులో అందమైన బాల్కనీ గార్డెన్, వ్యాయామ శాల, విశ్రాంతి తీసుకునేందుకు విలాసవంతమైన ప్రాంతం ఉందని సమాచారం. ఖరీదైన ఇంటీరియర్ డిజైన్స్ తో మరింత తళుకులీనుతోందని సమాచారం. అయితే ఇంత డబ్బు పెట్టి కొనడం వెనుక, ఆమె లగ్జరీ లైప్ వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఆమె పుట్టిన రోజు వేడుకలకు కూడా రూ. 93 లక్షలు వెచ్చించడంపై సినిమా పరిశ్రమలోని వారే కాదూ.. బయట వ్యక్తులు కూడా ఆమెకు అంత డబ్బు ఎక్కడ నుండి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.