హైదరాబాద్ లోని పాపులర్ సినిమా థియేటర్లలో పేరొందింది ‘తారకరమ’ థియేటర్. కాచిగూడ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ థియేటర్.. కొన్నేళ్లుగా మూతబడి ఉంది. తాజాగా నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ తారకరామ థియేటర్ ని పునః ప్రారంభించారు. అలాగే తారకరామ పేరును కాస్తా ‘ఏషియన్ తారకరామ’గా మార్చి థియేటర్ కి కొత్త హంగులు తీసుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతో దివంగత సినీ నిర్మాత నారాయణ్ కే. దాస్.. పదేళ్లుగా ఈ థియేటర్ ని పునరుద్దరించారు. ఆయన కుమారుడు సునీల్ నారంగ్ థియేటర్ ని అడ్వాన్స్ టెక్నాలజీతో మార్పులు చేసి పునః నిర్మించారు.
ఎన్టీఆర్, నారాయణ్ కే దాస్ మంచి స్నేహితులు. కాగా.. నందమూరి ఫ్యామిలీకి ఈ థియేటర్ ఎంతో ప్రత్యేకం. ఇప్పుడీ థియేటర్ లో పూర్తిగా కొత్త టెక్నాలజీతో.. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండింగ్, సీటింగ్ సిస్టమ్ తో రూపొందించారు. అలాగే సీటింగ్ కెపాసిటీ కూడా 975 నుండి 590కి కుదించి.. పూర్తి రీక్లైనర్ సీట్స్, సోఫాలను అరేంజ్ చేయడం విశేషం. ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైనింగ్ తో విజువల్ వండర్ ఎక్సపీరియెన్స్ ని తారకరామ అందించనుంది తెలుస్తోంది. ఈ నెల 16 నుండి ‘అవతార్ 2’ సినిమాతో తారకరామలో షోస్ మొదలు కాబోతున్నాయి. ఇక రీ ఓపెనింగ్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. “తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర ఉంది. బసవతారకం థియేటర్ మా తల్లి జ్ఞాపకార్థం నిర్మించాం. అది మాకు దేవాలయం. ఈ థియేటర్ కూడా మాకు దేవాలయంతో సమానం” అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘1978లో అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్ ని నిర్మించారు. ‘అక్బర్ సలీం అనార్కలి’ సినిమాతో ఈ తారకరామ థియేటర్ చరిత్ర మొదలైంది. కొన్ని అనివార్య కారణాల వలన 1995లో ఓసారి పునఃనిర్మించాం. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ వారితో కలిసి మరోసారి నూతన టెక్నాలజీతో రీ ఓపెనింగ్ చేయడం చేయడం ఆనందంగా ఉంది. గతంలో డాన్ సినిమా ఇందులో 525 రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు కూడా ఎన్నో విజయాలు సాధించాయి. పర్సనల్ గా నాకీ థియేటర్ సెంటిమెంట్. ఎందుకంటే.. మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ నామకరణం ఇక్కడే చేశారు’ అని చెప్పారు. ఇక బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీని సంక్రాంతికి ఇదే థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరి తారకరామ థియేటర్ ని రీ ఓపెన్ చేయడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.