టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడినా సరే కాంట్రవర్సీ అవుతూనే ఉంది. సంక్రాంతి కానుకగా ‘వీరసింహారెడ్డి’ సినిమాతో వచ్చిన బాలయ్య.. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ కులంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న బాలయ్య.. సదరు కమ్యూనిటికీ బహిరంగా క్షమాపణలు చెప్పారు. అలా అని ఉండాల్సింది కాదని అన్నారు. ఇక ఇది అయిపోయింది కదా అనుకునేలోపు ఇప్పుడు మరో ఇష్యూలో బాలయ్య చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా హీరోగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న బాలయ్యలోని మరో యాంగిల్ బయటకు తీసిన షో ‘అన్ స్టాపబుల్’. ఆల్రెడీ తొలి సీజన్ సూపర్ హిట్ కాగా.. ప్రస్తుతం రెండో సీజన్ లాస్ట్ కు వచ్చేసింది. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రసారమైంది. వ్యూస్ లో ఇప్పటివరకు లేని సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ ఎపిసోడ్ లో భాగంగా ఓ సందర్భంలో తనకు గతంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని బాలయ్య చెప్పుకొచ్చారు. సరిగ్గా ఆ టైంలో చేసిన కొన్ని కామెంట్సే ఇప్పుడు దుమారానికి కారణమయ్యాయి.
కాలేజీ రోజుల్లో తాను కూడా బైక్స్ పై ఎక్కువగా తిరిగేవాడినని చెప్పిన బాలయ్య.. ఓ రోజు రోడ్ క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన మరో బైక్ తనని ఢీకొట్టిందని చెప్పారు. దాంతో తాను ఎగిరిపడ్డానని, ఒళ్లంతా రక్తం కారడంతో తనని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. అక్కడ యాక్సిడెంట్ అని చెప్పొద్దు, కాలుజారి కిందపడ్డా అని చెప్పమని తన ఫ్రెండ్స్ సలహా ఇచ్చిన బాలయ్య తెలిపారు. ఆ టైంలో చికిత్స చేయడానికి వచ్చిన నర్స్ గురించి చెబుతూ.. ‘దానెమ్మ ఆ నర్సు ఏమో భలే అందంగా ఉంది. ముఖం క్లీన్ చేస్తూ ఏమైంది? అని అడిగింది. నేనేమో యాక్సిడెంట్ అయిందని చెప్పేశాను’ అంటూ బాలయ్య అప్పటి విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఈ మాటలో నర్సులకు కోపం తెప్పించాయి. యాక్సిడెంట్ అయి ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. తనకు వైద్యం చేయడానికి వచ్చిన నర్స్ గురించి గౌరవంగా మాట్లాడాల్సింది పోయి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే బాలకృష్ణ బహిరంగా క్షమాపణలు చెప్పాలని.. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాలయ్య వ్యాఖ్యలు, నర్సింగ్ సంఘం సారీ చెప్పమని డిమాండ్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.