ఈ మధ్య హీరోలు తమ పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలను కథాంశంగా తీసుకుంటున్నారు. అవి వాళ్ళ సినీ జీవితానికే కాకుండా.. తమ రాజకీయ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడుతున్నాయి. సినిమా అనేది ఎంతోమందిని ప్రభావితం చేసే సాధనం. అటువంటి సాధనం ద్వారా అనేకమంది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. కొంతమంది అయితే బయోపిక్ ల ద్వారా ప్రభావితం చేయగలిగారు. ఏ హీరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసినా రాజకీయాలంటే ఇంట్రస్ట్ ఉందా? రాజకీయాల్లోకి వస్తారా? అంటూ ప్రశ్నలు వేస్తారు. తాజాగా అల్లరి నరేష్ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.
హాస్యనటుడిగానే కాకుండా, సీరియస్ నేపథ్యమున్న పాత్రల్లోనూ నటించి మెప్పించిన అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ పనుల్లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో మీడియా పర్సన్.. ‘రాజకీయాల్లోకి వస్తారా’ అనే ప్రశ్నకు అల్లరి నరేష్ స్పందించారు. రాజకీయాలు తనకు తెలియదని, అసలు తనకు ఇంట్రస్ట్ లేని సబ్జెక్టు అని అల్లరి నరేష్ అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. నటుడిగానే కొనసాగుతానని, ఇంకా దర్శకుడవ్వాలన్న ఆసక్తి ఉందని.. దర్శకుడ్ని అవుతాను కానీ రాజకీయ నాయకుడ్ని మాత్రం అవ్వనని స్పష్టం చేశారు.